Telangana Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, ఈ నెల 28 నుంచి 9వ విడత రైతుబంధు డబ్బులు, వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం
ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది.
Hyd, June 23: తెలంగాణ రైతులకు శుభవార్త. 9వ విడత రైతుబంధు కింద అన్నదాతలకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం (Telangana Rythu Bandhu) అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్... వర్షాలు బాగా కురుస్తున్నందున రైతులకు రైతు బంధు సొమ్ము (Rythu Bandhu amount) అందించాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి.
ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది.
అంతే గాకుండా బుధవారం రాత్రి వరకు క్రయవిక్ర యాలు జరిగిన భూములకు చెందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ. 7,360.41 కోట్ల రైతు బంధు సాయం అందగా గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,412.53కోట్ల సాయం అందింది. 2022–23 సంవత్సరానికి బడ్జెట్‌లో రైతుబంధు కోసం ప్రభుత్వం రూ. 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో రూ. 50,447.33 కోట్ల సాయం అందించింది.