Hyd, June 22: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు (woman allegedly assaulted) పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ (Raidurgam police) పరిధిలో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఐటీ కారిడార్‌లోని నాలెడ్జ్ సిటీలో ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్‌లో 24 గంటలు తెరిచి ఉండే ఒటినో రూఫ్ టాప్ హ్యాంగింగ్ బార్‌కు (Hyderabad pub) శనివారం రాత్రి 11.30 గంటలకు యూఎస్‌లో రీసెర్చ్ స్కాలర్, న్యూట్రీషియన్‌గా పనిచేస్తూ నగరంలో ఉండే రాజస్తాన్‌కు చెందిన ఓ యువతి (25)తో కలిసి విష్ణు, విక్రమ్‌లు వెళ్లారు. యువతికి పరిచయస్తుడైన మయాంక్ అగర్వాల్, అబ్రార్, సాదత్, అరీఫుద్ధీన్‌లతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి అదే బార్‌కు వచ్చారు.
అర్థరాత్రి దాటిన తరువాత మయాంక్, సాదత్‌లు యువతిని పక్కకు పిలిచి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అడిగారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాక్సర్ విక్రమ్ దాడిలో అబ్రార్ గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అబ్రార్ శనివారం తెల్లవారు జామున రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడంతో తనపై లైంగిక దాడి చేస్తామని బెదిరించారని బాధిత యువతి సోమవారం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విక్రమ్ దాడిలో అబ్రార్, మయాంక్ వర్గం దాడిలో విష్ణు గాయపడ్డారని చెప్పారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని, సీసీ పుటేజీలు పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.