TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో 10లక్షల మందికి కొత్త పెన్షన్లు, వికారాబాద్‌కు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్, 75 మంది ఖైదీల విడుదల
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో కొత్తవి, పాతవి కలిసి 46 లక్షల పెన్షన్ దారులకు కొత్తకార్డులు అందజేయనున్నారు.
Hyderabad, AUG 11: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM Kcr) అధ్యక్షతన ప్రగతిభవన్‌లో గురువారం జరిగిన కేబినెట్ భేటీ (Telangana Cabinet meet) ముగిసింది. దాదాపు 5 గంటలపాటు సాగిన ఈ సమావేశంలో పలు కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుంచి 10 లక్షల కొత్త పెన్షన్లను (New pensions)మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వనున్నారు. దీంతో కొత్తవి, పాతవి కలిసి 46 లక్షల పెన్షన్ దారులకు కొత్తకార్డులు అందజేయనున్నారు. వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్ (ENT Tower) నిర్మించాలని నిర్ణయించారు.
అలాగే, కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి 10 మంది వైద్యులను నియమిస్తున్నట్టు తెలిపారు. సరోజినీ దేవీ కంటి ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు ఇచ్చారు. వికారాబాద్‌లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయించినట్టు స్పష్టం చేశారు.
తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల స్థలం కేటాయింపు. షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు 45 ఎకరాల స్థలం కేటాయింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో నివేదిక ఇచ్చి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు.