Viveka Murder Case: వివేకా హత్య కేసు, అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు, కస్టడీ విచారణ అవసరం లేదని స్పష్టం
ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
Hyd, May 31: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 27న వాదనలు ముగించిన హైకోర్టు.. నేడు తీర్పు వెలువరించింది.
అవినాష్‌రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ అవినాష్‌రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్‌రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్‌పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు మాత్రం హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది.