Mahesh Bank Hacking Case: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హ్యాకింగ్ జరిగిందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్
దాదాపు 2 నెలలపాటు, 100 మంది పోలీసు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడని తెలిపారు. మొత్తం 23 మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.
Hyd, mar 31: హైదరాబాద్‌లో మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును నగర పోలీసులు ఛేదించారు. దాదాపు 2 నెలలపాటు, 100 మంది పోలీసు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడని తెలిపారు. మొత్తం 23 మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. హ్యాకింగ్ కేసు (Mahesh Bank Hacking Case) నిందితులను బుధవారం సీవీ ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హ్యాకింగ్ చేయడం సులువైందని (Hyderabad Police cracks) సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్‌పై సైబర్‌దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CP CV Anand) తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టీఎస్ క్యాబ్)ను గతేడాది జూలైలో హ్యాక్ చేసిన ముఠా.. మహేశ్ బ్యాంక్‌పై గత నవంబర్ నుంచి దాడి మొదలు పెట్టిందని స్పష్టం చేశారు. నవంబర్ నెలలో మహేష్ బ్యాంకుకు చెందిన 200 మంది ఉద్యోగులకు హ్యాకర్ ఫిషింగ్ మెయిల్స్ పంపాడని చెప్పారు. ఇద్దరు ఉద్యోగులు మెయిల్ ఓపెన్ చేయగానే హ్యాకింగ్‌కు వీలు పడిందన్నారు.
మహేష్ బ్యాంక్‌ను సింగిల్ నెట్ వర్క్‌తో నడిపిస్తున్నారని చెప్పారు.. అసలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకే నెట్ వర్క్ వాడకూడదని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థకు ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, మహేష్ బ్యాంక్ అలాంటిది ఏర్పాటు చేసుకోలేదని తెలిపారు. ఈ కేసులో మహేష్ బ్యాంకు సిబ్బంది పాత్రపైనా విచారణ చేస్తామన్నారు సీపీ సీవీ ఆనంద్.
కాగా ఏపీ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లో చోటు చేసుకున్న సైబర్ నేరం రెండు రకాలుగా రికార్డు సృష్టించింది. ఈ స్కామ్‌లో సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.12,48,21,735 కాజేశారు. దీని దర్యాప్తు కోసం నగర పోలీసు విభాగం రూ.58 లక్షలు ఖర్చు చేసింది. ఇంత మొత్తం నగదుతో ముడిపడి ఉన్న సైబర్ నేరం నమోదు కావడం, ఓ కేసు దర్యాప్తు కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం కూడా నగర కమిషనరేట్ చరిత్రలో ఇదే తొలిసారి.
సైబర్ నేరగాళ్లు షానాజ్ బేగంతో పాటు శాన్విక ఎంటర్‌ప్రైజెస్, హిందుస్తాన్ ట్రేడర్స్, ఫార్మాహౌస్ ఖాతాలతో పాటు కటకం కోటేశ్వర్, ప్రియాంక ఎంటర్ ప్రైజెస్, ఫాతిమా మాత సెక్యూర్ వెల్డింగ్ సంస్థల ఖాతాలు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆఖరి మూడు ఖాతాల్లోకి నగదు పడలేదు. రెండు సంస్థల నిర్వాహకులను గుర్తించి, కొందరిని పట్టుకున్నారు.
జగద్గిరిగుట్ట చిరునామాతో ఉన్న ఫాతిమా మాత సెక్యూర్ వెల్డింగ్ సంస్థ బోగస్‌గా తేలింది. ఈ నేరం చేయడానికి ప్రధాన హ్యాకర్లు వినియోగించిన ఐపీ అడ్రస్‌లు అమెరికా, కెనడా, లండన్, రోమేనియాలవిగా కనిపిస్తోంది. అ యితే వాళ్లు ఫ్రాక్సీ సర్వర్లు వాడటంతో ఇవి ఎంత వరకు వాస్తమే ఇప్పుడే చెప్పలేం. ఈ హ్యాకర్లే గతేడాది నగరంలోని తెలంగాణ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ నుంచి రూ.1.98 కోట్లు కాజేసిందీ వీళ్లేనని అనుమానిస్తున్నామని సీపీ తెలిపారు.
హ్యాకింగ్ ఇలా జరిగింది.
విదేశాల నుంచి ప్రాక్సీ సర్వర్లు ఉపయోగించి నవంబర్ 4, 10, 16వ తేదీల్లో ఆర్టీజీఎస్, బ్యాంకు డిపాజిట్లు, డిస్కౌంట్లంటూ సబ్జెక్ట్ సూచిస్తూ.. బ్యాంకులో పనిచేసే 200 మందికి ఫిషింగ్ ఈ-మెయిల్స్‌ను పంపించారు. ఇద్దరు ఉద్యోగులు ఓపెన్ చేయడంతో వారి పాస్‌వర్డ్, యూజర్ ఐడీలను ప్రధాన హ్యాకర్లు అపహరించారు.
బ్యాంకుకు చెందిన పూర్తి డేటాబేస్ సర్వర్‌కు సంబంధించిన యాక్సెస్ అనుమతులు ఒకరిద్దరికే ఉండాలి. కానీ మహేశ్ బ్యాంక్‌లో పది మందికి ఉన్నాయి. దీంతో సునాయాసంగా హ్యాకర్ల చేతికి ప్రధాన డేటాబేస్, సర్వర్ పాస్‌వర్డ్, యూజర్ ఐడీ వివరాలు అందాయి.
ఆయా ఉద్యోగుల కంప్యూటర్లలోకి ఈ- మెయిల్స్ ద్వారా కీ లాగర్స్ పంపించారు.
మరోవైపు ఢిల్లీలో ఉన్న హ్యాండ్లర్లు ప్రధాన హ్యాకర్ల సూచనలతో బ్యాంకు ఖాతాలను సమకూర్చే పనిని చకచకా నిర్వహించారు. అలా శాన్విక ఎంటర్‌ప్రైజెస్, షాయినాజ్‌బేగం, హిందుస్థాన్ ట్రేడర్స్, సంపత్‌కుమార్, కటకం కోటేశ్వర్, ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్, ఫాతిమా మాత సెక్యూర్ వెల్డింగ్స్ ఖాతాదారులతో మాట్లాడి ఆయా అకౌంట్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జనవరి 22, 23వ తేదీల్లో శని, ఆదివారాలు ఉండడంతో హ్యాకర్లు డేటాబేస్ సర్వర్‌లోకి ప్రవేశించారు.
శాన్విక ఖాతాలో రూ. 299 ఉండగా, దానిని రూ. 4,00,40,361కు, షాయినాజ్‌బేగం అకౌంట్‌లో రూ. 2.5 లక్షలుండగా, రూ. 3,59,55,390, హిందుస్థాన్ ట్రేడర్స్ బ్యాంక్ ఖాతాలో రూ. 3 వేలుండగా రూ. 4,83,25,985లకు పెంచారు. సంపత్ ఖాతాలో రూ. 3 వేలుండగా రూ. 4,99,999కి పెంచారు. మిగతా మూడు ఖాతాల్లోనూ నగదును పెంచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
సంపత్ అకౌంట్ కేపీహెచ్‌బీలో ఉంది. ప్రధాన హ్యాండ్లర్లు ఇక్ఫా స్టీఫెన్ ఓర్జి, క్యాపిటల్ అనే వ్యక్తులు ఓపెన్ చేసి, అతడి ఖాతాలోకి ముందుగా రూ. కోటి డిపాజిట్ చేసి అక్కడి నుంచి వేరే ఖాతాల్లోకి బదిలీ చేశారు. అయితే అందులో రూ. 95 లక్షలు సాంకేతిక కారణాలతో తిరిగి వాపస్ వచ్చాయి.
ఆయా ఖాతాల్లో ఉన్న కోట్ల రూపాయల డబ్బును 115 బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 398 అకౌంట్లలోకి బదిలీ చేశారు.
హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించిన మహేశ్ బ్యాంక్ అధికారులు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగదు బదిలీ కాకుండా స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. రూ. 2.08 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి.
నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలు వివిధ రాష్ర్టాలకు వెళ్లాయి. తాజాగా అరెస్టయిన ఇక్ఫా స్టీఫెన్ ఓర్జీతో పాటు 23 మందిని పట్టుకున్నారు. ఇందులో నలుగురు నైజీరియన్లు ఉన్నారు.