IPL Auction 2025 Live

Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలెర్ట్‌, రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనం

బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది

Rains (Photo-Twitter)

రాగల మూడురోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురువనున్నట్లు వాతావరణశాఖ చెప్పింది.

మరో వైపు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గరిష్ఠంగా 30 డిగ్రీలు, కనిష్ఠంగా 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తాయని వివరించింది. మరో వైపు మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి.

అకస్మాత్తుగా హైదరాబాద్‌లో భారీ వర్షం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్, ఇంటికి వెళ్లే వారు అలర్ట్‌గా ఉండాలని పోలీసులు సూచన

ఈ రోజు సాయంత్రం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌షుక్‌ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల భారీ వాన కురుస్తోంది. వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.