TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ముగ్గురు నిందితులను రెండో రోజు విచారించనున్న సిట్ అధికారులు, కీలకం కానున్న ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక
చంచల్‌గూడలో జైలులో (Chanchalguda jail) ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను సిట్ అధికారులు రెండో రోజు తమ కస్టడీలోకి (police take three accused into custody)తీసుకున్నారు.
Hyd, Nov 11: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.ఈ కేసులో విచారణ కొనసాగుతున్నది. చంచల్‌గూడలో జైలులో (Chanchalguda jail) ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌లను సిట్ అధికారులు రెండో రోజు తమ కస్టడీలోకి (police take three accused into custody)తీసుకున్నారు. అక్కడినుంచి నేరుగా నాంపల్లిలోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించారు.
అక్కడ ముగ్గురు నిందితుల వాయిస్ రికార్డు చేయనున్నారు. బేరసారాల ఆడియో, వీడియోల వాయిస్‌తో అధికారులు వాటిని పోల్చి చూడనున్నారు. కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కీలకంగా కానున్నది.మొదటిరోజు విచారణలో భాగంగా పలు కీలక ప్రశ్నలకు సంధించారు సిట్ అధికారులు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (TRS MLAs Poaching Case) ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక కీలకం కానుంది. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు సూత్రధారులు, పాత్రధారులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీ అనంతరం నిందితులను కోర్టులో కోర్టులో హాజరపర్చనున్నారు పోలీసులు. కాగా ఏసీబీ కోర్టు అనుమతితో ముగ్గురు నిందితులను గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు 42 ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలపై ఉదయం ఒక్కొక్కరిని వేర్వేరుగా, మధ్యాహ్నం కలిపి ప్రశ్నించారు. 17 ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు. వీటిపై శుక్రవారం విచారణలో స్పష్టత తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కస్టడీ పూర్తయ్యాక నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సిట్‌లో మూడు విభాగాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏర్పాటుచేశారు. సిట్ సభ్యులు గురువారం సమావేశమై, ఈ కేసు దర్యాప్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. నిందితుల నుంచి సేకరించే వివరాలు, సాంకేతిక అంశాలు, డాక్యుమెంటేషన్ ఇలా విభజించి మూడు బృందాలకు అప్పగించారు.
నిందితుల నుంచి తొలిరోజు సేకరించిన వివరాలను విశ్లేషించిన సిట్ అధికారులు.. నిందితుల నుంచి మున్ముందు సేకరించాల్సిన సమాచారంపై బృందం సభ్యులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతోపాటు విచారణలో వెల్లడవుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ముంబయి, హర్యానా తదితర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపేందుకు తెలంగాణ పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.