TS SSC Results 2023: పరీక్షల్లో ఫెయిలైతే సప్లిమెంటరీ రాయండి, అంతేకాని ఆత్మహత్యలు చేసుకోవద్దు, తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దు, తెలంగాణలో నేడే పదవతరగతి ఫలితాలు
ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదల అంటేనే తల్లిదండ్రులకు గుండెల్లో వణుకుపుడుతోంది.
Hyd, May 10: నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని కొందరు, మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు అర్థాంతరంగా తమ జీవితాలను ముగించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదల అంటేనే తల్లిదండ్రులకు గుండెల్లో వణుకుపుడుతోంది. ఫెయిల్ అయితే తమ పిల్లలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వారు పిల్లలకు సపోర్ట్ గా నిలబడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు పిల్లలకు పెద్ద సపోర్ట్‌గా నిలవాలే కానీ మరో విద్యార్థితో కంపేర్ చేసి కోప్పడితే వారిని నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కసారి ఫెయిల్ అయితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. యానువల్ ఎగ్జాంలో ఫెయిలైతే సప్లిమెంటరీ ఉంటుంది. కానీ ప్రాణం పోతే సప్లిమెంటరీ ఉండదన్న విషయాన్ని కూడా విద్యార్థులు గుర్తించాలి.
తమను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా తమను కోల్పోతే వారు ఏమవుతారోనని ఒక్కసారైనా ఆలోచించాలి. అసలు నిజానికి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యమేదో సమస్యను ఎదుర్కోవడంలోనో.. ఫెయిలైన అనంతరం జీవితాన్ని మలచుకోవడం పైనో పెడితే ఆ తరువాతి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. కాబట్టి పదో తరగతి విద్యార్థులు దయచేసి మీరు మాత్రం ఫెయిల్ అయితే ఆత్మహత్య జోలికి వెళ్లకండి.