TSRTC Strike Called-off: ఆర్టీసీ సమ్మె విరమణ, రేపట్నించి విధుల్లోకి హాజరుకావాలని నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణ అని చెప్పి ట్విస్ట్ ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం
ఈ సందర్భంగా "ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు" అంటూ వ్యాఖ్యానించారు....
Hyderabad, November 25: ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కొద్ది సేపటి క్రితమే ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC) నేతలు, అకస్మాత్తుగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కార్మికులందరూ రేపట్నించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఇక ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది, రేపట్నించి విధులకు హాజరుకానవసరం లేదని స్పష్టం చేశారు.
అయితే కార్మికుల శ్రేయస్సు కోసం, తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె విరమించామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Rdeddy) తెలిపారు. ఈ సందర్భంగా "ఆర్టీసీ కార్మికులు ఓడిపోలేదు, ప్రభుత్వం గెలవలేదు" అంటూ వ్యాఖ్యానించారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఇక తాము సమ్మె విరమించినందున ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
ప్రభుత్వ స్పందనపై గత 5 రోజులుగా ఎదురుచూసిన ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం అత్యవసర సమావేశం అయ్యారు. ఎలా ముందుకెళ్లాలి అని అనేక విధాలుగా ఆలోచనలు చేశారు, ఒక దశలో సమ్మె కొనసాగించాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే అందుకు కార్మికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. సహనం, ఓపిక రెండూ నశించిన ఆర్టీసీ కార్మికులు ఇక తాము ఎంతమాత్రం సమ్మె కొనసాగించేందుకు సంసిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇదే విషయంపై యూనియన్ నేతలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు.
చివరకు సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వం స్పందించినా, స్పందించకపోయినా రేపట్నించి విధుల్లోకి హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచే విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ సిబ్బంది రావొద్దని, తమ విధులకు అడ్డంకులు కలిగించొద్దని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 05న సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులు ఎన్నో రకాలుగా నిరసన వ్యక్తం చేశారు, హైకోర్టులో పోరాడారు, ఆపై విలీనం డిమాండును విరమించుకున్నారు, ఆపై సమ్మె విరమిస్తామని ప్రకటించారు. అయినా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో మరో మెట్టు దిగి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. 52 రోజుల తమ పోరాటంలో నైతిక విజయం తమదేనని ఆర్టీసీ నేతలు పేర్కొన్నారు.
అయితే కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకునే అంశంపై ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ , గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) తో రాజ్ భవన్ లో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, నూతన రెవెన్యూ యాక్ట్ చట్టాలకు సంబంధించి గవర్నరుతో సీఎం కేసీఆర్ కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ సాయంత్రం మరోసారి అధికారులతో సీఎం కేసీఆర్ (CM KCR) రివ్యూ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ మీటింగ్ లో సీఎం కేసీఆర్, తమ పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆర్టీసీ కార్మికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవడంపై సీఎం నుంచి ప్రకటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమ్మె విరమించామని ప్రకటన చేశారు.
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.