TSRTC Privatization: రూట్లను ప్రైవేకటీరించడంపై కేబినేట్ నిర్ణయం తప్పెలా అవుతుంది? కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్ట్, విచారణ రేపటికి వాయిదా
ఇందుకు పిటిషనర్ స్పందిస్తూ మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం, రవాణావ్యవస్థలో ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు....
Hyderabad, November 19: రాష్ట్రంలో ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తూ (RTC Routes Privatization) తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు (High Court of Telangana)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ స్పందిస్తూ మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రాష్ట్ర రోడ్డు రవాణా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని హైకోర్ట్ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందని పిటిషనర్ ను హైకోర్ట్ ప్రశ్నించింది.
ఇందుకు పిటిషనర్ స్పందిస్తూ మోటార్ వాహన చట్టంలోని సెక్షన్ 102 ప్రకారం, రవాణావ్యవస్థలో ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, హైకోర్ట్ కల్పించుకొని సీఎం ఏం చెప్పారన్నది ఇక్కడ సంబంధం లేని అంశం, ఇక్కడ కేబినేట్ నిర్ణయం చట్టబద్ధమా? కాదా? సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటో చెప్పాలని పిటిషనర్ కు హైకోర్ట్ సూచించింది. రూట్లను ప్రైవేటీకరణ చేయకూడదని ఏ చట్టంలోనైనా ఉందా? అని ప్రశ్నించింది.
ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉంది. గతంలో ప్రభుత్వ సారథ్యంలో నడిచే ఎయిర్ ఇండియా ఒక్కటే ఉండేది. ఆ తర్వాత ఎన్నో ప్రైవేట్ ఎయిర్ లైన్స్ విజయవంతమయ్యాయని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
హైకోర్టులో ఫలితాలు అనుకూలంగా వచ్చే సూచనలు లేకపోవడంతో ఇక సమ్మె కొనసాగించాలా? ముగించాలా? అనేదానిపై ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC) మరికాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం డిపోల వారీగా కార్మికుల నుంచి జేఏసీ నేతలు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇందుకు మిశ్రమ స్పందన వస్తున్నట్లు తెలుస్తుంది.