Hyderabad, November 3: టీఎస్‌ఆర్టీసీ ( TSRTC) సమ్మెపై సస్పెన్స్ ఇంకా అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణా సీఎం కేసీఆర్ (TS CM KCR) ఉద్యోగులకు డెడ్‌లైన్ ఇచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. యూనియన్ల మాయలో పడి బతుకులు ఆగం చేసుకోవద్దు. మీ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఐదో తేదీ మంగళవారం రాత్రి 12 గంటల్లోగా విధుల్లో చేరండి.. కుటుంబాలను కాపాడుకోండి. ఉద్యోగాలకు రక్షణ ఉంటుంది అని తెలిపారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విధుల్లో చేరకుంటే మధ్యప్రదేశ్ తరహాలో తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రమవుతుందని స్పష్టంచేశారు. వంబర్ ఐదో తేదీ అర్ధరాత్రి లోగా కార్మికులు విధుల్లో చేరని పక్షంలో అన్ని రూట్లను ప్రైవేటుపరం చేస్తామని తెలిపారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఐదు గంటల పాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మాటల్లో..
‘ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అర్దరహితం, దురహంకారపూరితం, అది అంతు లేని కోరికలతో జరుగుతున్న సమ్మె. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించి.. విలీనం అసాధ్యమని తిరస్కరించడంతో పాటు 5,100 ఆర్టీసీ బస్సులను ప్రైవేటు రంగానికి ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రశ్నను మానుకోండని చెప్పారు. మొత్తంగా 5,100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తాం. ఇప్పటికే ఉన్న 2,100 అద్దె బస్సులు ఇక ఆర్టీసీలో ఉండవని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రైవేటు ఆపరేటర్లు కూడా సిద్దంగా ఉన్నామని అన్నారు. కార్మికులు ఐదో తేదీ అర్దరాత్రి లోగా విధుల్లో చేరకుంటే ఆరు, ఏడు తేదీల్లో ఆర్టీసీ భవిష్యత్తు నిర్ణయిస్తాం. ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచన లేదు’ అని సీఎం స్పష్టం చేశారు.
బీజేపీపై మండిపాటు
బీజేపీకి ఈ రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ప్రజల పక్షాన వారిని ప్రశ్నిస్తున్నా. కేంద్రంలో మోటారు వాహన సవరణ చట్టం ఆమోదించినపుడు లోక్‌సభలో మీరు ఉన్నారు కదా. అక్కడ అనుకూలంగా ఓటు వేసి ఇక్కడ డ్రామాలు చేస్తున్నారా. నితిన్ గడ్కరీ పార్లమెంటులో బిల్లు పెట్టినపుడు మీరు అంత పవిత్రులైతే నిరసన తెలపాలి కదా. నైతికత ఉందా.. మీ ప్రభుత్వం చేసిన చట్టంలో భాగస్వాములై ఇక్కడ వీరంగం వేస్తున్నారా? శవాలు మీద పేలాలు ఏరుకునే రకం.. చీప్ పొలిటికల్ టాక్టిక్స్’ అంటూ బీజేపీ ఎంపీల తీరుపై సీఎం మండిపడ్డారు.ఆర్టీసీ కార్మికుల విషయంలో బీజేపీ ఎంపీలు చేసిన దుర్మార్గాలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా దుయ్యబట్టారు.
హైకోర్టు తీర్పుపై...
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయంలో కూడా కేసీఆర్ స్పందించారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్ జారీ చేశారని హైకోర్టు ఆర్టీసీ ఎండీపై మండిపడిన నేపథ్యంలొ ఆయన మాట్లాడుతూ కోర్టు అలా అనలేదు. అనడానికి కోర్టుకు కూడా అధికారం ఉండదు. అది కేవలం అవతలి అడ్వకేట్ మాత్రమే అంటున్నారని తెలిపారు. ఉప ఎన్నికలు జరిగిన హుజూర్‌నగర్‌కు రూ.100 కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆర్టీసీ కార్మికుల జీతాలు ఇవ్వడానికి రూ.47 కోట్లు లేవా? అని హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుబట్టారు. ‘అలా కామెంట్ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా డబ్బులిచ్చేది.. ఒక హుజూర్‌నగర్‌కే ఎలా ఇస్తుంది? మేము పాలకులమంటూ తెలిపారు.
కేసీఆర్‌పై ప్రతిక్షాలు మండిపాటు
సీఎం కేసీఆర్ మాటల్లో అడుగడుగునా అహంకారం, అధికార మదం కొట్టొచ్చినట్లు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ ప్రకటనలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది.
ఆర్టీసీ కార్మికులు ఏమంటున్నారు
సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఈనెల ఐదో తేదీలోగా విధుల్లో చేరాలని, లేని పక్షంలో వారికి ఆర్టీసీతో సంబంధాలు తెగిపోతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వాఖ్యల నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి బెదిరింపు ధోరణితో మాట్లాడినా కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆ బెదిరింపులకు లొంగాల్సిన అవసరం లేదని తెలిపారు.