TSRTC Strike: టీఎస్ ఆర్టీసీ నిల్, ప్రైవేట్ ఫుల్! సమ్మె నేపథ్యంలో ఆర్టీసీలో సీట్ బుక్ చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్న ప్రయాణికులు, ప్రైవేట్ సర్వీసులకు భారీ డిమాండ్, ఈరోజు తెలంగాణ కేబినేట్ భేటీ
ఎక్కడికైనా వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ బస్సులనే ఆశ్రయించాల్సి వస్తుంది...
Hyderabad, October 01: సరిగ్గా టైం చూసి 'స్ట్రైక్' దెబ్బ కొడుతున్నారు ఆర్టీసీ కార్మికులు. అక్టోబర్ 05 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు టీఎస్ ఆర్టీసీ జేఏసీ (TSRTC JAC) ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చింది. దీంతో ఆ దెబ్బ నేరుగా సామాన్య ప్రయాణికులపై పడింది. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండగ అయిన దసరా- బతుకమ్మ వేడుకల (Dasara- Bathukamma Festivals) కోసం సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే చాలా మంది టికెట్ రిజర్వేషన్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 05 నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. అయితే సరిగ్గా అక్టోబర్ 05 మొదటి షిఫ్ట్ నుంచే విధులకు దూరంగా ఉంటున్నట్లు ఆర్టీసి కార్మికులు తెలపడంతో ఆర్టీసీ బస్సులో టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు నేరుగా రైలు మార్గాలు లేవు. ఎక్కడికైనా వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ బస్సులనే ఆశ్రయించాల్సి వస్తుంది. ఇక ఇలాంటి ఆర్టీసీ స్ట్రైక్స్ ఉన్నప్పుడు అసలైన పండగ చేసుకునే ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యాలు ఇప్పుడు కూడా టికెట్ ధరలు భారీగా పెంచేసి పండగ చేసుకుంటున్నాయి.
ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ ఇదే!
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి ఆ దిశగా కమిటీ వేశారు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ తెలంగాణ కార్మికులపై పడింది. సీఎం కేసీఆర్ కూడా గతంలోనే విలీనం హామి ఇచ్చారని, ఇప్పటివరకూ ఆ హామి నెరవేరలేదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు, దీనితో పాటు మరో 25 డిమాండ్లతో TSRTC-JAC ప్రభుత్వానికి సమ్మె నోటీస్ జారీచేసింది.
మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం భేటీకానుంది. ఈ భేటీలో ప్రధానంగా TSRTC కార్మికుల డిమాండ్లు, నూతన రెవెన్యూ చట్టానికి ఆమోదం మరియు తదితర కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. మరి ఆర్టీసీ కార్మికులకు సమస్యకు ఈరోజు ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అనేది చూడాలి.