Telangana Assembly Election 2023: వెలమలు, రెడ్లను తట్టుకుని కొల్లాపూర్ కోటలో బర్రెలక్క పాగా వేయగలదా, కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల సమరంపై ప్రత్యేక కథనం
నిండా పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది
Kollapur, Nov 22: మరి కొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ సామాన్య యువతి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. నిండా పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. సోషల్ మీడియాతో పాటు అన్ని రకాల మీడియాలను తన వైపు తిప్పుకుని కొత్త రాజకీయ శకానికి నాంది పలికేలా దూసుకుపోతోంది.
దేశం నలుమూలల నుంచి ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారంటే ఆ యువతి హవా ఎలా ఉందో ఇట్టే చెప్పవచ్చు, సోషల్ మీడియా సైతం ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతోంది. ఇంతకీ ఈ బర్రెలక్క ఎవరు, ఆమె అసలు పేరు ఏమిటీ, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, దుర్భేధ్యమైన కేసీఆర్ సర్కారును ఢీకొట్టే సాహసం ఎందుకు చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టిస్తుందా..ఓ సారి పరిశీలిద్దాం.
బర్రెలక్కగా ఎలా పాపులర్ అయింది
ఈ యువతి గతంలో ‘హాయ్ ఫ్రెండ్స్ బర్లగాయనికి వచ్చిన’ అని ఓ 30 సెకండ్ల వీడియో తీసింది. అందులో గవర్నమెంట్ జాబ్స్ కు నోటిఫికేషన్స్ రావడం లేదని. డిగ్రీలు డిగ్రీలు చదివితే మెమోలు వస్తున్నయ్, తప్ప జాబ్ లు వస్తలేవని చెప్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అప్పుడే శిరీష కాస్తా బర్రెలక్కగా మారింది. ఈ వీడియో తీసినందుకు ఆమె మీద పోలీస్ కేసు నమోదయ్యింది. అందులో ప్రభుత్వాన్ని కానీ, రాజకీయనాయకులను కానీ విమర్శించలేదు. తిట్టలేదు. అయినా కానీ కేసులు పెట్టి, అమ్మాయి అని కూడా చూడకుండా బాగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని బర్రెలక్క తన ఎన్నికల ప్రచారంలో చెప్పింది.
మా అమ్మకు ఆరోగ్యం బాగుండదు, నాకు ఇల్లు లేదు, ఆస్తులు లేవు. పెద్ద కొత్తపల్లిలో మజీదుకు ఎదురుగా చిన్న తడకల షాపు పెట్టుకుని బతుకుతున్నా. ఉద్యోగం రాకపోవడంతో మా అమ్మకు భారం అవ్వొద్దని నాలుగు బర్రెలు కొనుకున్నా. నా దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తో రీల్స్ చేసేదాన్ని. అలా మొదటిసారి
హాయ్ ఫ్రెండ్స్ బర్ల గాయనికి వచ్చిన అని ఓ 30 సెకండ్ల వీడియో తీసిన.. వీడియో తీసినందుకు నామీద కేసు పెట్టారు.
ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారు. తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఉన్న బర్రెలు అమ్మి, ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలని హైదరాబాద్ కు వచ్చాను. మంచి కోచింగ్ సెంటర్ ల జాయిన్ అయిన. చాలా కష్టపడి చదివిన. కానీ, ప్రతీ ఒక్క ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నరు. గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలా ప్రతీ ఎగ్జామ్ పేపర్లను అమ్ముకున్నరు.
బర్రెలక్క కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించండి, తెలంగాణ డీజీపీని కోరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
జాబ్ వస్తదని అందరనుకున్నట్లే నేను అనుకున్నా.. సామాన్యురాలిగా వెడితే ఇబ్బంది పెడుతున్నరని.. రాజకీయాల్లోకి రావాలనుకున్నా.. నామినేషన్ కు కావాల్సి రూ.5వేలు కూడా అందరి దగ్గర తీసుకుని వేశా. నామినేషన్ సమయంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాతి రోజునుంచీ బెదిరింపులు మొదలయ్యాయి’అని చెప్పుకొచ్చింది.
యానాం వాసి మల్లాడి కృష్ణారావు సాయం
బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష(Karne Sirisha) ఎన్నికల ప్రచారం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, యానాం వాసి మల్లాడి కృష్ణారావు రూ.లక్ష విరాళం పంపించారు.కులమతాలకు అతీతంగా ధన ప్రభావం లేకుండా యువత ఎన్నికల్లో పోటీచేసి గెలవాలన్న లక్ష్యంతో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారని, ఆమె విజయాన్ని ఆకాంక్షిస్తూ ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపానని మల్లాడి కృష్ణారావు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత సహకారంతో ఆమెను గెలిపించాలన్నారు.
బర్రెలక్క జీవిత నేపథ్యం ఏమిటి
శిరీష నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందింది. కడు పేద కుటుంబం. తండ్రి తాగుబోతు. చిన్నప్పుడే వదిలేసి పోయిండు. తల్లితో కలిసి నానా కష్టాలు పడింది. చదువు మీద ఉన్న ప్రేమతో ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ చేసింది. గ్రూప్ -1, గ్రూప్ -2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. తనకు పోలీస్ శాఖలో చేరాలని కోరిక. కానీ ఏదీ కాలేక పోయింది.ఆ సమయంలోనే ఉద్యోగం రాదని నాలుగు బర్రెలను పెట్టుకున్నానంటూ ఆ మధ్యన రీల్ చేసింది. అది కాస్తా వైరల్ అయ్యింది. మెల మెల్లగా సోషల్ మీడియాను షేక్ చేసింది. లక్షలాది మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇంకా నిలుస్తూనే ఉన్నారు.
అన్ని వర్గాల ప్రజలు , ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు , గాయనీ గాయకులు , సోషల్ మీడియా వారియర్స్ , బహుజన సంఘాలు , లెక్చరర్లు, ప్రొఫెసర్లు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. తాను నిరుద్యోగుల తరపున బరిలో ఉంటానని ప్రకటించింది. ఈ మేరకు నామినేషన్ దాఖలు చేసింది.
కొల్లాపూర్ నియోజక వర్గ చరిత్ర
మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కొల్లాపూర్ ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇదివరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంలో కలిశాయి. 1952 నుండి ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 7 సార్లు విజయం సాధించగా, 3 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ, కమ్యూనిష్టులు ఒక్కోసారి విజయం సాధించాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు.
వెలమ సామాజిక వర్గానిదే హవా
కొల్లాపూర్ లో 10 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978, 1983, 1985 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు కొత్త వెంకటేశ్వర్‌రావు విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో కొత్త రామచందర్‌రావు గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కటికనేని మధుసూదన్‌రావు, 1999, 2004, 2009, 2012, 2014 ఎన్నికల్లో వరుసగా జూపల్లి కృష్ణారావు విజయకేతనం ఎగురవేశారు. ఇక మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లు శాసన సభ్యులుగా విజయం సాధించారు. 1952లో అనంత రామచంద్రారెడ్డి, 1967లో బీ నర్సింహా రెడ్డి, 2018లో బీఆర్ఎస్ నుంచి బీరం హర్ష వర్థన్ రెడ్డి విజయం సాధించారు.
కొల్లాపూర్ నియోజకవర్గానికి జూపల్లి కృష్ణారావు 1999 నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందులో 2012లో జరిగిన ఓ ఉప ఎన్నిక కూడా ఉంది. కాగా ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య కేబినెట్‌లో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.
మూడు సార్లు స్వతంత్య్ర అభ్యర్థులు విజయం
కృష్ణాతీరంలో విస్తరించిన కొల్లాపూర్ నియోజకవర్గంలో 1967 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి సారి వెలటూరుకు చెందిన నర్సింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కె.రంగదాసును 1,585 ఓట్ల తేడాతో ఓడించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను కొత్త వెంకటేశ్వర్‌రావుకు కేటాయించింది. దీంతో కె.రంగదాసు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి వెంకటేశ్వర్‌రావుపై 3,558 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పొత్తు కారణంగా టికెట్‌ను బీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కేటాయించడంతో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కటికనేని మధుసూదన్‌రావుపై జూపల్లి 3,040 ఓట్ల తేడాతో గెలుపొందారు.
మొదటిసారి కమ్యూనిస్టు అభ్యర్థికి పట్టం కట్టిన కొల్లాపూర్‌వాసులు ఆ తర్వాత 1978 నుంచి 2014 ఎన్నికల వరకు పది పర్యాయాలుగా వరుసగా వెలమ కులస్థులను అందలం ఎక్కించారు. వెలమలను ఓడించి ఎమ్మెల్యే పదవి చేపట్టాలని గత నాలుగు ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ప్రయత్నించగా.. చివరికి 2018లో బీరం హర్షవర్ధన్‌రెడ్డి విజయం సాధించి వెలమల అప్రతిహిత విజయాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈసారి కూడా వెలమ, రెడ్డి సామాజిక వర్గాల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుండగా స్వతంత్య్ర అభ్యర్థి బర్రెలక్క కూడా చుక్కలు చూపిస్తోంది.
నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటాపోటీ రాజకీయం నడిచేది. 1983 నుంచి 2012 వరకు టీడీపీ అభ్యర్థులు ఆరుసార్లు ఎన్నికల బరిలో నిలిచారు. 1985, 1989, 2014, 2018 పొత్తుల కారణంగా పోటీ చేయలేదు. 1994లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి కటికనేని మధుసూదన్‌రావు కాంగ్రెస్ అభ్యర్థి రామచందర్‌రావుపై 33,774 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు.గెలుపు అవకాశాలున్నప్పటికీ గ్రూపు తగాదాల కారణంగా 1999, 2004, 2009లో టీడీపీ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. చివరగా 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయగా.. 35 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.
2019 ఎన్నికల్లో పోటీలో ఎవరు ?
తాజాగా కొల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏలేని సుధాకర్ రావు బరిలో నిలిచారు. వీరితో పాటుగా స్వతంత్య్ర అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ వేశారు. ప్రస్తుతం బర్రెలక్క.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది.
తనపై దాడికి దిగినా తాను వెనక్కి తగ్గేది లేదంటోంది. ఆమెకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్వచ్చందంగా ఆమె తరపున ప్రచారం చేస్తున్నారు. గెలిచినా ఓడినా బర్రెలక్క మాత్రం చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు కొల్లాపూర్ ప్రజలు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే కొంత కాలం పాటు ఆగాలి.