Hyderbad: దారి విష‌యంలో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌, ఫుల్లుగా మ‌ద్యం తాగి అన్న‌పై పెట్రోల్ పోసి నిప్పంటించిన త‌మ్ముడు

సాయంత్రం అన్న శ్రీనివాస్‌ తన ఇంటి అద్దె వసూలు చేసుకొని.. వెళ్తున్న సమయంలో వెనుక నుంచి పెట్రోల్‌ పోసి నిప్పంటించి ( Set On Fire) పారిపోయాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి 108 అంబులెన్స్‌లో గాంధీ వైద్యశాలకు తరలించారు.

Fire (Representational Image; Photo Credit: IANS)

Hyderabad, FEB 12: ఇండ్ల మధ్య ఉన్న దారి విషయమై తగాదాతో అన్నపై పెట్రోల్‌ పోసి (Poured Petrol) నిప్పంటించాడు తమ్ముడు. ఈ దారుణం బోయిన్‌పల్లి (Boinpally) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. బేగంపేట ఏసీపీ రామలింగ రాజు, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్‌పల్లి కంసారి బజార్‌ రామమందిరం వీధిలోని మహంకాళి ఆలయం ముందు అన్నదమ్ములు శ్రీనివాస్‌, వినోద్‌కు సంబంధించిన స్థలం ఉంది. శ్రీనివాస్‌ (62) మొబైల్‌ రీచార్జ్‌ సెంటర్‌ నడిపిస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. తన భవనాన్ని అద్దెకు ఇచ్చి బోయిన్‌పల్లిలోని మరో ఇంటిలో నివాసముంటున్నాడు. తమ్ముడు వినోద్‌ (42) ఎలక్ట్రిసిటీ శాఖలో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. శ్రీనివాస్‌, వినోద్‌ ఇండ్ల మధ్య దారి ఉంది. శ్రీనివాస్‌ తన ఇంటికి వెళ్లాలంటే.. ఇదే దారి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

Viral Video: లైవ్ వీడియోలో కిచెన్ లో పేలిన గ్యాస్ సిలిండర్..చుట్టు పక్కల వాళ్లు పరుగో పరుగు..  

అయితే ఈ దారిలో వినోద్‌ ఓ బాత్రూం నిర్మించాలని అనుకున్నాడు. అన్న శ్రీనివాస్‌ రానూపోనూ దారి ఉండదని వారిస్తూ వస్తున్నాడు. దీంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల వారి కుటుంబసభ్యుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. దీంతో అన్నపై కక్ష పెంచుకున్న వినోద్‌.. ఆదివారం ఉదయం మద్యం తాగి.. పథకం ప్రకారం తన ఇంటిలో ఓ డబ్బాలో 3 లీటర్ల పెట్రోలును నిల్వ ఉంచాడు. సాయంత్రం అన్న శ్రీనివాస్‌ తన ఇంటి అద్దె వసూలు చేసుకొని.. వెళ్తున్న సమయంలో వెనుక నుంచి పెట్రోల్‌ పోసి నిప్పంటించి ( Set On Fire) పారిపోయాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసి 108 అంబులెన్స్‌లో గాంధీ వైద్యశాలకు తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.