Google Job: గూగుల్ సీఈఓ అవ్వాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి, ఇప్పటికే తీవ్రమైన పోటీ! సుందర్ పిచాయ్ పోస్ట్‌కు ఎసరుపెట్టిన లింక్‌డ్‌ఇన్.
అయితే ఉన్నట్లుండి అతడు ఆ పోస్టుకు రాజీనామా చేయాబోతున్నాడా? అంటే...
Googleలో జాబ్ అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? అందులో పనిచేసే ఉద్యోగులకు కళ్ళు చెదిరే జీతాలు, కనీవినీ ఎరగని సౌకర్యాలు, ఊ.. అంటే పిల్లను ఇచ్చేందుకు పోటీపడే మామయ్యలు. ఆ రేంజ్ లో ఉంటుంది పరిస్థితి. మరి అలాంటిది ఏకంగా ఆ సంస్థకు CEOగా పనిచేసే అవకాశం వస్తే ఇంకేమైనా ఉంటుందా? ఈ భూమి మీద ఆ పోస్ట్ దొరకడం ఒక కల. ఇంకేంముంది Google CEO పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోమని చెప్పగానే లక్షల కొద్దీ అప్లికేషన్లు వచ్చిపడ్డాయి.
ఈ వ్యవహారం ఎక్కడో తేడా కొడుతుంది కదా? ప్రస్తుతం గూగుల్‌కి సీఈఓగా మన దేశానికే చెందిన సుందర్ పిచాయ్ (Sundar Pichai) పనిచేస్తున్నారు. ఆయనకు ఏమైంది? ఇంత గొప్ప ఉద్యోగాన్ని వదులేస్తున్నాడా? 2016లోనే అతడి వార్షిక జీతం 199 మిలియన్ డాలర్లు (మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ 1,200 కోట్లకు పైమాటే). ఇప్పటికీ సంస్థను ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. అలాంటిది అతడి పోస్ట్ ఖాళీ అవుతుందంటే నమ్మకం కలగడం లేదని ఓ దరఖాస్తుదారుడు లింకిడ్‌ఇన్ (Linkedin)లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అప్పటికి గానీ లింక్‌డ్‌ఇన్ సంస్థకు బల్బ్ వెలగలేదు. వెంటనే తమ ద్వారా జరిగిన పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తూ ఆ పోస్టును తొలగించింది. ఇప్పుడు అర్థమైందా ఇది ఎవరి నిర్వాకమో?.
ఉద్యోగ- ఉపాధి ఆధారిత సేవలను నిర్వహించే ప్రముఖ సంస్థ లింక్‌డ్‌ఇన్ తమ వెబ్‌సైట్‌లో గూగుల్ సీఈఓ పోస్ట్ కోసం అప్లై చేసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరెంతో మంది దరఖాస్తు కూడా చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తప్పుతెలుసుకున్న లింక్‌డ్‌ఇన్, ఆ పోస్ట్ టెక్నికల్ ఎర్రర్‌గా చెప్తూ మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. లింక్‌డ్‌ఇన్ లో ఎలాంటి ఫేక్ జాబ్స్ పోస్టింగ్స్‌కి గానీ, అనుమానాస్పద వ్యక్తులకు, ఫ్రాడ్ చేసేవారికి స్థానం లేదని, నిబంధనలకు అతిక్రమించే ఎలాంటి వారినైనా, ఎలాంటి జాబ్ పోస్టింగ్స్ అయినా తాము వెంటనే గుర్తించి అప్పటికప్పుడే వాటిని తొలగిస్తామని సంస్థ వివరణ ఇచ్చుకుంది.