Digital Rupee: భారత్ నుంచి సొంత కరెన్సీ, డిసెంబర్‌ కల్లా డిజిటల్‌ రూపీ ట్రయిల్స్‌ ప్రారంభిస్తామని తెలిపిన రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

సెంట్రల్‌బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీలు(సీబీడీసీ)గా పేర్కొనే ఈ ప్రతిపాదిత డిజిటల్‌ కరెన్సీ ఆన్‌లైన్‌లో చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న కరెన్సీనోట్లు, నాణేలకు ఆన్‌లైన్‌ రూపంగా డిజిటల్‌ రూపీ ఉంటుంది.

RBI Governor Shaktikanta Das (Photo Credits: IANS/File)

New Delhi, August 28: భారత్‌‌లో ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా ఇండియాలో డిజిటల్‌ రూపీ ట్రయిల్స్‌ (Digital Rupee Trails) ప్రారంభిస్తామని రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. సెంట్రల్‌బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీలు(సీబీడీసీ)గా పేర్కొనే ఈ ప్రతిపాదిత డిజిటల్‌ కరెన్సీ ఆన్‌లైన్‌లో చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుంది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న కరెన్సీనోట్లు, నాణేలకు ఆన్‌లైన్‌ రూపంగా డిజిటల్‌ రూపీ ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తి కాంత్ దాస్ (Central bank governor Shaktikanta Das) ఒక CNBC ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిజిటల్‌ కరెన్సీ అనేది పూర్తిగా కొత్త సాధనం అయినందున, రిజర్వ్‌బ్యాంక్‌ ఆచితూచి అడుగులు వేస్తుందని తెలిపారు.

డిజిటల్‌ కరెన్సీ సెక్యూరిటీ, ద్రవ్య విధానంపై దీని ప్రభావం, చెలామణీలో ఉన్న నగదుపై డిజిటల్‌ రూపీ ప్రభావం వంటి అంశాలన్నింటినీ పరిశీలించి, ఈ సంవత్సరాంతానికల్లా తాము డిజిటల్‌ కరెన్సీ ట్రయిల్స్‌ మొదలుపెడతామని శక్తికాంత దాస్‌ వివరించారు. ఈ కొత్త కరెన్సీకి ఒక కేంద్రీకృత లెడ్జర్‌ను ఉపయోగించాలా లేక బహుళ భాగస్వాములు కలిగిన డిజిటల్‌ డేటాబేస్‌ను నిర్వహించాలా అనే అంశంపై కూడా కసరత్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

దేశంలో మళ్లీ క్రమంగా పెరుగుతున్న కేసులు, తాజాగా 46,759 మందికి క‌రోనా, నిన్న రికార్డు స్థాయిలో ఒకే రోజు కోటి మందికి పైగా వ్యాక్సినేషన్

సెంట్రలైజ్డ్‌ లెడ్జర్‌ అయితే పూర్తిగా ఆర్బీఐ నిర్వహిస్తుంది. క్రిప్టోకరెన్సీలకు ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, నగదు వాడకం తగ్గడం వంటి కారణాలతో ఇప్పటికే యూకే, చైనా, యూరప్‌లు డిజిటల్‌ కరెన్సీల్ని వినియోగంలోకి తెచ్చే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పట్ల ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో హఠాత్తుగా వడ్డీ రేట్లు పెంచబోమని ఆర్బీఐ గవర్నర్‌ హామీ ఇచ్చారు. పరిస్థితిని గమనిస్తున్నామని, తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అంటూ ‘ఇంకా తగిన సమయం రాలేదని మేం భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. హఠాత్‌ రేట్ల పెంపుతో మార్కెట్లను ఆశ్చర్యానికిగానీ, షాక్‌కుగానీ గురిచేయబోమన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుని, వృద్ధిబాటలో కొనసాగితేనే విధాన మార్పునకు అది సరైన సమయమవుతుందని ఆయన చెప్పారు.