Internet Shutdowns in India: డిజిటల్ ఇండియా ఎక్కడ, 2012 నుంచి భారత్‌లో 665సార్లు ఇంటర్నెట్ షట్‌డౌన్, నాలుగేళ్లుగా ప్రపంచంలో మొట్ట మొదటి స్థానం మనదేశానిదే !
అయితే ఇది కూడా పలు వివాదాలకు దారి తీస్తోంది.
డిజిటల్ ఎమర్జెన్సీ అనేది మన దేశంలో రోజు రోజుకు పెరిగిపోతోంది, ఎక్కడ ఏ చిన్న ఆందోళనలు జరిగినా, ఉద్రిక్తతలు తలెత్తినా వెంటనే అక్కడి ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవల్ని (Internet Shutdowns in India) నిలిపివేస్తున్నాయి. అయితే ఇది కూడా పలు వివాదాలకు దారి తీస్తోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇంటర్నెట్ షట్‌డౌన్లలో నాలుగేళ్లుగా ప్రపంచంలో భారతే మొట్ట మొదటి స్థానంలో ఉండటం. ఆ మధ్య, అగ్నిపథ్, ప్రవక్తపై వ్యాఖ్యలు, సాగు, పౌరసత్వ సవరణ చట్టాలు వంటి వాటి నిరసనల్లో ప్రభుత్వం ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసింది.
ప్రతి ఉద్యమం సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. దీంతో ప్రభుత్వాలు ఇంటర్నెట్ షట్‌డౌన్ చేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ఇదిలా ఉంటే కరోనా అనంతరం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇంటర్నెట్ లేకుండా ప్రజలు ఉండలేని స్థాయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలూ లేకుండా ఉన్నట్టుండి నెట్ సర్వీసులు నిలిపివేస్తుండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భారత్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్స్‌పై అధ్యయనం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ) (Software Freedom Law Center ) ప్రకారం 2012 నుంచి ఇప్పటివరకు ఏకంగా ఇండియాలో 665సార్లు ఇంటర్నెట్ సేవలను (665 Internet Service Shutdown Since 2012) నిలిపివేశారు. నెట్ నిలిపివేతను ఆయుధంగా వాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాదిలోనే జూన్ నాటికి దేశంలో ఏకంగా 59 సార్లు నెట్ కనెక్షన్ కట్ అయింది! జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనది. కశ్మీర్ ప్రజలు ఏకంగా 552 రోజుల పాటు నెట్ సౌకర్యానికి దూరమయ్యారు. తరచూ నెట్‌ను నిలిపేస్తున్న రాష్ట్రాల జాబితాలో కశ్మీర్ తర్వాత రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
ఇక ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం పౌరులకు రాజ్యాంగమిచ్చిన ప్రాథమిక హక్కులకు భంగకరమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ (ఐఎఫ్‌ఎఫ్) అనే న్యాయవాదుల గ్రూపు వాదిస్తోంది. దీనిపై ఈ సంస్థ పలుమార్లు కోర్టుకెక్కింది కూడా. ఇంటర్నెట్ సదుపాయముంటే విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందుతాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయే తప్ప, అది ఉంటే వారు వాస్తవాలు తెలుసుకునే అవకాశమూ ఉంటుందని ఆలోచించలేకపోతోందని వాదిస్తోంది.
ఇక ప్రభుత్వాల వాదన వేరేలా ఉంది. ఉద్యమం జరిగినప్పుడు తప్పుడు సమాచారం, వదంతులు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని వాదిస్తోంది. కాబట్టే నెట్ కట్ చేస్తున్నట్టు అవి చెబుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా టెలికాం నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు నెట్ సేవలను నిలిపేసే అధికారం 2017 దాకా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం జిల్లా జడ్జిలకు ఉండేది. ఇంటర్నెట్ సేవలు ఆపేయడం తప్పనిసరైతే మధ్యేమార్గంగా వదంతులను వ్యాప్తి చేసే ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్ వంటి సోషల్ ప్లాట్‌ఫారంలను ఆపేసి మిగతావి కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక 2019లో 4 వేల గంటల పాటు దేశంలో నెట్ సేవలు ఆగిపోవడంతో 130 కోట్ల డాలర్లకు పైగా నష్టం కలిగిందన్నది ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇంటర్నెట్ లేక తాను పత్రికను ప్రింట్ చేసుకోలేకపోతున్నానని కశ్మీర్‌కు చెందిన అనూరాధా భాసిన్ అనే జర్నలిస్టు సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈ పిటిషన్ విచారణలో నిరవధికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం ఆమోదయోగ్యం కాదని కోర్టు తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, వృత్తి, వ్యాపారాలను నిర్వహించుకునే హక్కులను రాజ్యాంగంలోని 19(1)(ఎ), ఆర్టికల్ 19(1)(జి) ఆర్టికళ్లలో పేర్కొన్న మేరకు పరిరక్షించాల్సిందే’ అని ఆదేశించింది. అయినా ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నాయి.