LG Mobile Business Closed: ఎల్‌జీ ఫోన్ యూజర్లకు షాక్, మొబైల్ ఫోన్ల వ్యాపారానికి గుడ్ బై చెప్పిన ఎల్‌జీ కంపెనీ, గత ఆరేళ్లలో రూ.32,856 కోట్ల నష్టాలను చవిచూసిన దక్షిణ కొరియా దిగ్గజం

మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని (LG Mobile Business Closed) నిర్ణయించినట్టు అధికారికంగా ధృవీకరించింది. భారీ నష్టాలకారణంగా స్మార్ట్‌ఫోన్‌ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలను ముగించనున్నట్లు (LG To Shut Down Mobile Business) తెలిపింది.

LG (File Image)

Seoul/New Delhi, April 5: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ సంచలనం నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ వ్యాపారానికి స్వస్తి పలకాలని (LG Mobile Business Closed) నిర్ణయించినట్టు అధికారికంగా ధృవీకరించింది. భారీ నష్టాలకారణంగా స్మార్ట్‌ఫోన్‌ డివిజన్ ఉత్పత్తి అమ్మకాలను ముగించనున్నట్లు (LG To Shut Down Mobile Business) తెలిపింది.

దాదాపు అరేళ్లుగా తీవ్ర నష్టాలతో కొట్టిమిట్టాడుతున్న ఎల్‌జీ తన ఫోన్ వ్యాపారాన్ని జర్మనీకి చెందిన వోక్స్ వాగన్ ఏజీ, వియత్నాం కంపెనీ విన్‌గ్రూప్ జెఎస్‌సీ సహా రెండు బడా కంపెనీలకు విక్రయించాలన్న ప్లాన్లు విఫలం కావడంతో ఈ దిశగా కంపెనీ అడుగులు వేసింది. తద్వారా మార్కెట్ నుండి పూర్తిగా వైదొలిగిన మొట్టమొదటి ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా ఎల్‌జీ నిలిచింది.

కాగా ఎల్‌జీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలతో సహా అనేక సెల్ ఫోన్ ఆవిష్కరణలతో మార్కెట్‌లోకి దూసుకొచ్చింది. 2013లో ఆపిల్‌, శాంసంగ్‌ తరువాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది. కానీ ఆ తరువాత తీవ్రపోటీకి తోడు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రమాదాల వివాదంలో పడింది. మరోవైపు చైనా ప్రత్యర్థులతో పోల్చితే కంపెనీకి మార్కెటింగ్ నైపుణ్యం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

భారత్ నుంచి 60 లక్షల ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్, ఫేస్‌బుక్ ఆన్‌లైన్‌లో వేలానికి పర్సనల్‌ సమాచారం, ఫోన్‌ నంబర్‌, దీంతో పాటుగా 106 దేశాల్లో ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీక్

కాగా గత ఆరేళ్లలో ఎల్‌జీ దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (రూ.32,856 కోట్లు) మేర నష్టాలను చవిచూసింది. ఈ కారణంగానే మొబైల్ బిజినెస్ నుంచి వైదొలగాలని కంపెనీ నిర్ణయించుకుంది. నష్టాల నుంచి గట్టేందుకు అన్నిరకాల అవకాశాలను పరిశీలిస్తున్నామంటూఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవో ప్రకటించినప్పటికీ చివరకు ఈ రంగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ ప్లాన్లను ఎల్‌జీ నిలిపివేసింది. రోలబుల్ డిస్‌ప్లే ఫోన్‌ల ఉత్పత్తిని కంపెనీ ఈ ఏడాది ఆరంభంలోనే నిలిపివేసింది. 'ది రోలబుల్' గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్‌జీ తిరిగి సీఈఎస్‌ 2021లో ప్రదర్శించింది.