Satya Nadella: అమెరికాను ఏలుతున్న తెలుగువాడు, ఏడాదికి రూ.305 కోట్ల ప్యాకేజీతో దుమ్మురేపిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్, ప్రశంసలతో ముంచెత్తిన బోర్డు డైరకర్లు
క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది.
San Francisco, October 18: తెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ సంస్థ అమితవేగంతో దూసుకువెళుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. దీంతో బోర్డు డైరక్టర్లు సత్య నాదెళ్లను అభినందనలతో ముంచెత్తారు. ప్యాకేజిని ఒక్కసారిగా పెంచేశారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 305 కోట్లు (42.9 మిలియన్ డాలర్లు) ఆయన వేతనంగా అందుకున్నారు. 2017-18తో పోలిస్తే, ఇది 66 శాతం అధికం. ఆయన మూలవేతనం 2.3 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ ఆప్షన్స్ కింద దాదాపు 29.6 మిలియన్ డాలర్లను ఆయన అందుకున్నారు. సత్య నాదెళ్ల నాయకత్వంలోని మైక్రోసాఫ్ట్ టీమ్, పలు కొత్త సాంకేతికతలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనడంలోనూ ముందు నిలిచింది. ఈ కారణంతోనే ఆయన వేతనం కూడా పెరిగిందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
సత్య నాదెళ్ల గత ఐదేళ్లుగా మైక్రోసాఫ్ట్ సీఈఓ గా పనిచేస్తున్నారు. హైదరాబాదీ అయిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టేనాటికి మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్షరాలా 302 బిలియన్ డాలర్లు.అప్పటి నుంచి వ్యహాత్మక ఎత్తుగడలు, అద్భుతమైన నాయకత్వంతో.. 2018 సెప్టెంబర్ 4 నాటికి దాన్ని 850 మిలియన్ డాలర్లకు తీసుకెళ్లారు. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటరింగ్‌లో సత్య నాదెళ్ల వ్యూహం సంస్థకు మరింత ప్లస్ అయిందని చెప్పొచ్చు.
సత్య నాదెళ్ల సీఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు (2014) 84.3 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. ఇప్పటి వరకు అదే ఆయన అందుకున్న అత్యధిక వేతనం. ప్రస్తుతం ఆయన ఖాతాలో 9,00,000 షేర్లు ఉన్నాయి. ఇక, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు సగటున 1,72,512 డాలర్ల వేతనం అందుకున్నారు. 2018 ఏడాదిలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 18.7 మిలియన్ డాలర్ల (రూ.133 కోట్లు) వేతనాన్ని అందుకోగా, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 1.9 మిలియన్ డాలర్ల(రూ.13.51 కోట్లు) వేతనం కంటే సత్య నాదెళ్ల అత్యధికంగా అందుకున్నారు.