Chandrayaan-3: సక్సెస్‌ఫుల్‌గా కొసాగుతున్న ప్రజ్ఞాన్ రోవర్‌ యాత్ర, ల్యాండర్ నుంచి 8 మీటర్లు ప్రయాణించిన ప్రజ్ఞాన్, మరిన్ని కీలక అంశాలు వెల్లడించిన ఇస్రో

అది ప్రణాళికాబద్ధంగా సుమారు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా ప్రయాణించినట్లు ఇస్రో తెలిపింది.

Watch Chandrayaan-3's Rover Pragyan Ramp Down From Vikram Lander to Moon's Lunar Surface (Photo-ISRO)

New Delhi, AUG 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 (Chandrayaan 3) (Chandrayaan-3)కు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అది అందజేస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి చంద్రుడి ఉపరితలంపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్ (Rover Pragyan) తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ప్రణాళికాబద్ధంగా సుమారు 8 మీటర్ల దూరాన్ని విజయవంతంగా ప్రయాణించినట్లు ఇస్రో తెలిపింది. అలాగే రోవర్‌లోని పేలోడ్‌లు, ఎల్‌ఐబీఎస్‌, ఏపీఎక్స్‌ఎస్‌లను ఆన్‌ చేసినట్లు చెప్పింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్‌తోపాటు రోవర్‌లోని అన్ని పరికరాలు పని చేస్తున్నాయని తాజా ట్వీట్‌లో పేర్కొంది.

మరోవైపు చంద్రుడిపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌ (Vikram lander) నుంచి ప్రజ్ఞాన్ రోవర్‌ బయటకు వచ్చేందుకు 26 యంత్రాంగాలు సహాయపడినట్లు ఇస్రో తెలిపింది. అలాగే విద్యుత్‌ ఉత్పత్తి చేసి రోవర్‌కు శక్తిని ఇచ్చే సోలార్ ప్యానల్ అత్యంత కీలకమైనదని పేర్కొంది.

 

కాగా, చంద్రయాన్‌-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్‌పై అన్ని దేశాలు దృష్టిసారించాయి. దీంతో చంద్రుడి నేలపై ప్రయాణం ప్రారంభించిన రోవర్‌ ప్రజ్ఞాన్ పంపనున్న ఫోటోలు, అది అందించే సమాచారం గురించి సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది.