Chandrayaan2: సాంకేతిక కారణాలతో చందమామ ప్రయాణం వాయిదా. అదే నిర్ధిష్ట సమయానికి ఎందుకు ప్రయోగించాలి? ఈ ప్రయోగం వాయిదా వేయకపోతే ఏం జరిగి ఉండేది?

ఒకసారి ఈ ప్రయోగం ఆగిపోతే మళ్ళీ అనుకూల సమయం కోసం వేచి చూడాల్సిందే, అందుకు కొన్ని వారాల సమయం పడుతుంది....

Chandrayaan2 | Photo: ISRO

Sriharikota: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చందమామ ప్రయాణం, చంద్రయాన్-2 (Chandrayaan2) జూలై 15, 2019 సోమవారం తెలవారు ఝామున సరిగ్గా 2:51 సమయానికి చేపట్టాల్సిన ప్రయోగం అనూహ్యంగా నిలిచిపోయింది. అంతా సిద్ధం చేసి కౌంట్ డౌన్ దగ్గరవుతున్న వేళ 'జీఎస్ఎల్వీ మార్క్3' లో చిన్న సాంకేతిక లోపం కారణంగా ప్రయోగ సమయానికి 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్ డౌన్ ను నిలిచిపోయింది.

ఒకసారి ఈ ప్రయోగం ఆగిపోతే మళ్ళీ అనుకూల సమయం కోసం వేచి చూడాల్సిందే, అందుకు కొన్ని వారాల సమయం పడుతుంది. జూలై నెలలో 15వ తేదీన సోమవారం 2:51 నిమిషాల నుంచి 3:01 గంటలు కేవలం 10 నిమిషాలు మాత్రమే చంద్రయాన్-2 స్పేస్ షిప్ ప్రయోగానికి అనువైన సమయంగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక జూలై లోని మిగతా రోజుల్లో కేవలం 1 నిమిషం మాత్రమే అనువైన సమయం ఉన్నట్లుగా తెలుసుకున్నారు.

ఎందుకిలా అంటే, భూమి ఒక చోట స్థిరంగా ఉండదు తిరుగుతూ ఉంటుంది, అదే సమయంలో చంద్రుడి గమనంలో మార్పులు ఉంటాయి. ఒకసారి ప్రయోగం చేపట్టిన తర్వాత చంద్రయాన్-2 కూడా ప్రయాణంలోనే ఉంటుంది. కాబట్టి వీటి గమనానికి అనుగుణంగా ఏ సమయంలోనైతే భూమికి చంద్రుడు తక్కువ దూరంలోకి వస్తున్నాడో లెక్కించి ఆ నిర్ధిష్ట సమయంలోనేనే (లాంచ్ విండో) ఈ ప్రయోగాన్ని చేపట్టాల్సి ఉంటుంది. లేకపోతే స్పేష్ షిప్ అనుకున్న ప్రదేశానికి కాకుండా, చంద్రుడిని దాటి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సూర్యవ్యవస్థలో చంద్రుడు- భూమి గమనం, గురుత్వాకర్శణ శక్తి ఆధారంగా ఈ ప్రయోగానికి అనువైన సమయాన్ని లెక్కించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫలానా సమయంలో ప్రయోగిస్తున్నప్పుడు ఆ వ్యోమ నౌక అంతరిక్షంలో మిగతా ఉపగ్రహలు, లేదా ఏవైనా శకలాలను ఢీకొట్టే ప్రమాదం ఏదైనా ఉందా? అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే చంద్రయాన్-2 కి సోమవారం 2:51 కాలం సరైన 'లాంచ్ విండో' గా తేల్చినప్పటికీ చిన్న లీకేజీ కారణంగా అది నిలిచిపోయింది. ఒకవేళ అనుకున్న సమయానికే చంద్రయాన్2 ప్రయోగం జరిగి ఉంటే కేవలం 16 నిమిషాల్లోనే నిర్ధిష్ట కక్ష్యలో శాటిలైట్ ప్రవేశపెట్టబడి, సెప్టెంబర్ 5 లేదా 6వ తేదీన చంద్రునిపై అనుకున్న స్థానంలో ల్యాండ్ అయి ఆపై 15 నిమిషాల్లోనే అక్కడి సమాచారం, ఫోటోలు ఇతర డేటా ఈ శాటిలైట్ అందించేది.

అయితే ముందుగానే సమస్యను పసిగట్టి ప్రయోగం నిలిపివేయడం ద్వారా చేసిన ప్రయోగం విఫలం కాకుండా, ఎలాంటి నష్టం జరగకకుండా నివారించడం జరిగింది. అయితే ఈ వాయిదా తాత్కాలికమే, ప్రయోగానికి అవసరమయ్యే మరో లాంచ్ విండో దొరినపుడు  మరికొన్ని వారాల్లోనే ఈ ప్రయోగం తిరిగి చేపట్టనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.