
Washington, FEB 15: అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita williams) బుచ్ విల్మోర్ (Butch Wilmore) తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది. ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత.. మార్చి 19న వారు భూమి మీదకు బయల్దేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ (Gravity) కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవట. పెన్సిల్ లేపినా వర్కౌట్ చేసినట్టే ఉంటుందట. ఈ విషయాన్ని విల్మోర్ మీడియాకు వెల్లడించారు. ‘‘గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుంది. శరీరమంతా భారమైన భావన కలుగుతుంది. పెన్సిల్ ఎత్తినా వర్కౌట్‌తో సమానమవుతుంది’’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్‌లో తెలియాడుతూ ఉండే వ్యోమగాములు.. భూమి మీదకు వచ్చిన 24 గంటల్లో ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతూ ఉంటారు.
ఇదేగాకుండా అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం కూడా వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది.
బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా నాసా గత జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. అయితే వారంలోగా వ్యోమగాములు భూమి పైకి తిరిగి రావాల్సిఉంది. కానీ, ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ యాత్రలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వాహక నౌక థ్రస్టర్లలో లోపాలు తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ సమస్యగా పరిణమించింది. దీంతో అందులో ప్రయాణించడం సురక్షితం కాదని నాసా తేల్చింది. దాంతో ఎనిమిది నెలలుగా వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వారు తిరిగి భూమి మీదకు బయల్దేరనున్నారు.