![](https://test1.latestly.com/uploads/images/2024/09/sunita-williams-barry-butch-wilmore.jpg?width=380&height=214)
Washington DC, FEB 14: అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) త్వరలో భూమిపైకి చేరనున్నారు. ఆమెతోపాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ (Butch Wilmore) కూడా కిందకి రానున్నారు. ఈ మేరకు వీరిద్దరు స్పేస్ నుంచి సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారికోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని విల్మోర్ తెలిపారు.
8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ గత ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సిఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు ఎనిమిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు.