Nepal Plane Crash: నేపాల్‌లో కుప్పకూలిన విమానం, ప్రమాద సమయంలో విమానంలో 72 మంది, 5గురు భారతీయులు సహా మొత్తం 15 మంది విదేశీయులు
కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు.
Pokhara, JAN 15: నేపాల్(Nepal)లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం(plane crash) చోటు చేసుకొంది. కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం, ఓల్డ్ ఎయిర్ పోర్టు మధ్య చోటు చేసుకొంది. ఈ విషయాన్ని యతి ఎయిర్‌లైన్స్ సిబ్బంది సుదర్శన్ బర్తౌలా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తెక్ బహదూర్ కేసీ స్థానిక పత్రికలకు తెలిపారు.
ఈ విమానంలోని వారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని ఆయన చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన చోట భారీగా మంటలు చెలరేగడంతో భద్రతా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో విమానానికి చెందిన ఒక్క రెక్క తప్ప మొత్తం కాలిపోయింది. ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్నాయి.
ఇప్పటి వరకు ఎవరినీ కాపాడలేకపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ విమానంలో 10 మంది విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.