Kabul Blasts: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 72 మంది దుర్మరణం మరియు వంద మందికి పైగా గాయాలు, తామే జరిపినట్లు ప్రకటించిన ఐఎస్, వెంటాడి.. వేటాడి పగ తీర్చుకుంటామన్న యూఎస్

ఆయన మాట్లాడుతూ "ఈ దాడికి పాల్పడిన వారికి, అలాగే అమెరికాకు హాని చేయాలని కోరుకునే ఎవరికైనా ఇది తెలిసే ఉంటుంది - మేము ఎవర్నీ క్షమించము, దేనిని మర్చిపోము, బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం...

Explosions at Kabul Airport | Photo: Twitter

Kabul, August 27: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో గురువారం సాయంత్రం తర్వాత సంభవించిన వరుస బాంబు పేలుళ్లలో కనీసం 72 మంది మరణించారు మరియు 143 మందికి పైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు దురాక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో దేశాన్ని విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ చిక్కుకున్న తమ దేశ పౌరులను స్వదేశానికి చేర్చేందుకు యూఎస్, యుకే మరియు భారత్ సహా పలు దేశాలు అతి కష్టం మీద భారీ ఎయిర్‌లిఫ్ట్ చేపడుతున్నాయి.

ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయం యూఎస్ బలగాల ఆధీనంలో ఉంది. అయితే యూఎస్ బలగాలు వెళ్లిపోవాలని తాలిబాన్లు ఆగష్టు 31 వరకు రెడ్ లైన్ విధించారు. ఈ నేపథ్యంలో గడువు దగ్గరపడుతుండటంతో ఇక తమను ఆదుకునేవారు ఎవరూ ఉండరని వేల సంఖ్యలో ప్రజలు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రం వైపు పరుగులు తీస్తున్నారు. గురువారం సాయంత్రం రద్దీగా మారిన కాబూల్ విమానాశ్రయం వెలుపల ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.

ఈ దాడిలో ఇప్పటివరకు 72 మంది మరణించినట్లు సమాచారం అందగా అందులో 60 మంది పౌరులు కాగా, మిగతా 12 మంది యూఎస్ దళాలకు చెందిన సర్వీస్ సిబ్బంది ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు పేలుళ్ల తర్వాత, సెంట్రల్ కాబూల్‌లో మరో రెండు పేలుళ్లు సంభవించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ వరుస పేలుళ్లకు తామే బాధ్యులం అని ఇస్లామిక్ స్టేట్ (IS) ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

కాబూల్‌లో జరిగిన పేలుళ్లలో 12 మంది యుఎస్ సర్వీస్ సభ్యులు మరణించటం పట్ల అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ "ఈ దాడికి పాల్పడిన వారికి, అలాగే అమెరికాకు హాని చేయాలని కోరుకునే ఎవరికైనా ఇది తెలిసే ఉంటుంది - మేము ఎవర్నీ క్షమించము, దేనిని మర్చిపోము, బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి ప్రతీకారం తీర్చుకుంటాం" అని హెచ్చరించారు. అలాగే తమ పౌరులను ఆగష్టు 31 తర్వాత కూడా తరలించే ప్రక్రియ కొనసాగిస్తామని జోబైడెన్ స్పష్టం చేశారు.