Nicotine on COVID-19: పొగతాగే వారికి కరోనావైరస్ ముప్పు తక్కువా? నికోటిన్ పొర వైరస్ సోకకుండా అడ్డుకట్ట వేస్తుందని చెప్తున్న తాజా అధ్యయనం, ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడి
అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఇప్పటివరకు ఫ్రాన్స్ లో నమోదైన కోవిడ్-19 కేసుల్లో పొగతాగే వారి కంటే పొగ తాగని వారే భారీగా ఉన్నారని తేలింది......
Paris, April 24: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి అంతుచిక్కని సందేహాలను కల్పిస్తూ సైంటిస్టులు, ఆరోగ్య నిపుణులకు కఠినమైన సవాళ్లు విసురుతోంది. కొంతమందికి ఈ వైరస్ సోకినా, ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదనే ఆరోపణ ఇప్పటికే ఉండగా ఇప్పుడు మరో సందేహం ఉత్పన్నమైంది. అదేంటంటే, పొగతాగే వారు కోవిడ్-19 బారినపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఫ్రాన్స్ కు చెందిన వైద్యుల బృందం చేసిన తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఇది నిజమా? కాదా? అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని వారు చెబుతున్నారు.
కోవిడ్-19తో తీవ్రంగా ప్రభావితమైన దేశాలలో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఈ దేశంలో ఇప్పటికే సుమారు 1 లక్షా 60 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు సుమారు 22 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని పిటియా-సాల్పాట్రియర్ యూనివర్శిటీ హాస్పిటల్ (Pitié-Salpêtrière University Hospital) కు చెందిన వైద్య పరిశోధన బృందం తమ దేశంలో కోవిడ్-19 బారిన బాధితులందరిపై పరిశోధనలు జరిపారు. ఎలాంటి వారు కోవిడ్-19 బారిన పడుతున్నారనే దానిపై అధ్యయనం చేశారు. కరోనావైరస్ మానవ సృష్టే, నోబెల్ గ్రహీత మాంటగ్నియర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫ్రాన్స్ జనాభాలో సుమారు 35 శాతం మంది పొగతాగే వారు కాగా, సుమారు 25.4 శాతం మంది రెగ్యులర్ లేదా చైన్ స్మోకర్లు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే ఇప్పటివరకు ఫ్రాన్స్ లో నమోదైన కోవిడ్-19 కేసుల్లో పొగతాగే వారి కంటే పొగ తాగని వారే భారీగా ఉన్నారని తేలింది. ఫ్రాన్స్ లో కరోనావైరస్ బారినపడ్డ వారిలో స్మోకింగ్ చేసే వారి శాతం కేవలం 4.4- 5.3 శాతం మధ్యే ఉన్నట్లు గుర్తించారు.
ఇదే క్రమంలో వారు చైనా దేశంలో ఎలాంటి వారు కోవిడ్-19 బారిన పడ్డారనే దానిపై కూడా విశ్లేషణ చేయగా, చైనాలో కూడా స్మోకింగ్ చేసే వారికంటే స్మోకింగ్ చేయని వారే ఎక్కువ మంది కరోనావైరస్ చేత ప్రభావితమైనట్లు గుర్తించారు.
ఇది తెలుసుకొని ఆశ్చర్యపోయిన ఆ వైద్యుల బృందం పొగాకులో ఉండే 'నికోటిన్' (Nicotine) అనే పదార్థం కరోనావైరస్ సోకకుండా అడ్డుకట్ట వేస్తుందా? అనే అంచనాకు వచ్చారు. సాధారణంగా పొగతాగే వారి శరీర కణాలపై ఈ నికోటిన్ ఒక పొర లాగా ఏర్పడుతుంది. ఈ సిద్దాంతం ప్రకారం ఇప్పుడు బయట నుంచి వచ్చే ఏవైనా ఇతర వైరస్ లు కణాలలోకి చొచ్చుకొని వెళ్లకుండా నికోటిన్ అడ్డుకుంటుందా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. శ్వాసకోశసంబంధమైన వ్యాధులను కలిగించే వైరస్ లపై నికోటిన్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? నికోటిన్ ప్యాచెస్ (Nicotine Patches) ఉపయోగించడం ద్వారా ఏమైనా ప్రభావం కనిపిస్తుందా? అనే దానిపై ప్రస్తుతం ఆ వైద్య బృందం క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు.
మొదట్లో పొగతాగే వారు కరోనావైరస్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్పారు. కోవిడ్-19 తీవ్రతలో పొగతాగడం ఒక ప్రతికూలాంశం అని చెప్పబడింది. అయితే ఇది ఇంతవరకు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. ఏది ఏమైనా కోవిడ్-19 కు మించిన దుష్ఫలితాలు పొగత్రాగడం ద్వారా కలుగుతాయి కాబట్టి, ఎవరూ కూడా పొగ తాగరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో లేని అనారోగ్యాలను చేజేతులా తెచ్చుకోవడం కంటే ఆరోగ్యంగా ఉండటంపై దృష్టి పెట్టాలని వైద్య పరిశోధకులు సలహా ఇస్తున్నారు.