Covid Pandemic: కరోనా సెకండ్ వేవ్..డేంజర్ జోన్‌లో ఇండియా, బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండవ స్థానంలోకి, దేశంలో 1.35 కోట్లకు చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్ ఎగుమతిపై నిషేధం
దేశంలో సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. తాజాగా కోవిడ్ కేసుల్లో భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి (India overtakes Brazil ) ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలోకి (world’s second worst-hit country) చేరింది.
New Delhi, April 12: దేశంలో కరోనా ప్రమాదకర స్థితికి చేరుకుంది. దేశంలో సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. తాజాగా కోవిడ్ కేసుల్లో భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి (India overtakes Brazil ) ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలోకి (world’s second worst-hit country) చేరింది. రాయిటర్స్ ప్రకారం బ్రెజిల్ 1.34 కోట్ల కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసులు 1.35 కోట్లకు చేరుకుంది. 3.12 కోట్ల కేసులతో ప్రపంచ స్థాయికి అమెరికా ముందుంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు (COVID Update) నమోదవడం విస్తరణ తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే మరో 904 మంది కోవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.35 కోట్లకు చేరగా, మరణించిన వారి సంఖ్య 1,70,179కి చేరింది.
ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో కోవిడ్ ఉధృతి బాగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో కేసులు 37 శాతం పెరిగి 63,294 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత 24 గంటల్లో 349 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 15,276, ఢిల్లీలో 10,774 కేసులు నమోదయ్యాయి.
ఛత్తీస్‌గఢ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. మరోవైపు రాష్ట్రానికి వచ్చేవారు తమ కరోనా నెగిటివ్ రిపోర్టు అధికారులకు తప్పనిసరిగా చూపించాల్సివుంటుంది. దీనికి తోడు ఆ రిపోర్టు గడచిన 72 గంటలలోపుగా తీసుకున్నదై ఉండాలి. కాగా కంటైన్మెంట్ జోన్లలో ఇంటికే నిత్యావసర సరుకులు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
షాకింగ్ రిపోర్ట్..సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బందికి కరోనా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసులు విచారణ, ఒక్క రోజే కోర్టులో 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్
ఇదిలా ఉంటే కొవిడ్ రెండు డోసుల టీకాలు తీసుకున్నాక కూడా భారత యువకుడికి కరోనా సోకడం సింగపూర్ దేశంలో సంచలనం రేపింది. కొవిడ్-19 రెండు డోసుల టీకా తీసుకొని వర్క్ పర్మిట్‌పై సింగపూర్ దేశానికి వచ్చిన భారత యువకుడు కరోనా బారిన పడ్డారు. సింగపూర్ దేశంలో 20 కరోనా కేసులు వెలుగుచూడగా వారిలో కొవిడ్ టీకాలు వేసుకున్నాక కూడా భారత యువకుడికి కరోనా సోకిందని తేలింది.కరోనా సోకిన యువకుడిని వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. రెండు సార్లు జరిపిన పరీక్షల్లోనూ భారత యువకుడికి కరోనా పాజిటివ్ అని రావడంతో అతన్ని పరీక్షించేందుకు జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రానికి తరలించారు.
కోవిడ్ కల్లోలానికి కరోనా మృతులకు అంత్యక్రియలు చేసేందుకు కూడా స్థలం కరువవుతోంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి యూపీలోని లక్నో మున్సిపాలిటీకి ఎదురయ్యింది. కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే ఇటువంటి 20 ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. ఇవి కూడా సరిపోకపోవడంతో మరో 50 ప్లాట్‌ఫామ్‌లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కరోనా మృతులకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజే 15,353 కరోనా కేసులు బయటపడటంతో అప్రమత్తమైన యోగి సర్కారు అన్ని జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. 500కు పైగా కరోనా కేసులు నమోదైన జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూను విధించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పాఠశాలలు, విద్యాసంస్థలను ఏప్రిల్ 30వతేదీ వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనాతో తెలుగు జర్నలిస్టు మృతి చెందారు. జీ సంస్థలో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్న విజయవాడకు చెందిన సిద్ధిఖి మహమ్మద్ (29) రాంమనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారం క్రితం ఆయనకు కరోనా సోకడంతో నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమై పరిస్థితి విషమించడంలో ఆయనను ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చేర్చిన కొద్ది గంటల్లోనే సిద్ధిఖి ప్రాణాలు విడిచారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ చికిత్సకు వినియోగిస్తున్న యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. దేశంలో కొవిడ్-19 అదుపులోకి వచ్చే దాకా.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, వాటి తయారీకి వినియోగించే ముడి సరుకుల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్) ఎగుమతులను నిలిపి వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, రానున్న రోజుల్లో ఈ ఔషధానికి డిమాండ్ పెరగొచ్చని అంచనా వేసింది.
ప్రజలకు రెమ్‌డెసివిర్ లభ్యతను పెంచేందుకుగానూ.. వాటిని తయారుచేసే ఫార్మా కంపెనీలు తమ వెబ్‌సైట్లలో స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్ల వివరాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని రెమ్‌డెసివిర్ నిల్వలను తనిఖీ చేస్తూ, అవి నల్లబజారుకు తరలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.
రెమ్‌డెసివిర్ ఔషధ ఉత్పత్తిని పెంచే విషయమై కంపెనీలతో కేంద్ర ఫార్మాస్యూటికల్ విభాగం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది. అమెరికాకు చెందిన గైలీడ్ సైన్సెస్ కంపెనీ అభివృద్ధిచేసిన రెమ్‌డెసివిర్ ఔషధాన్ని భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు ఏడు కంపెనీలు లైసెన్సింగ్ పొందాయి. ప్రతినెలా 39 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం వీటి సొంతం. కాగా, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల సరఫరా సాఫీగా జరిగేలా చూసేందుకు అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర నిర్ణయించింది.