PM Modi addressing the nation on coronavirus situation | (Photo Credits: DD News)

New Delhi, April 12: దేశంలో నిన్న కొత్త‌గా 1,68,912 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 75,086 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,27,717కు (Coronavirus India) చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 904 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,70,179కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. 12,01,009 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,45,28,565 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ తీవ్ర రూపం దాల్చిన వేళ కోవిడ్‌–19పై అతి పెద్ద యుద్ధం ప్రారంభమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాగా ఏప్రిల్‌ 11న మొదలైన టీకా ఉత్సవ్‌ (Tika Utsav) ఈ నెల 14 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సంక్షోభ సమయంలో ప్రజలంతా ఎలా మెలగాలో పలు సూచనలు చేశారు.

దేశంలో ప్రమాదకరంగా మారిన కరోనా, ఇండియాలో 10 కోట్ల మార్క్‌ను దాటిన కొవిడ్ టీకా డోస్‌లు

కరోనాపై విజయం సాధించాలంటే ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. క్షేత్ర స్థాయిలో మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్లు ఎన్ని ఏర్పాటు అయ్యాయన్న దానిపై మన విజయం ఆధారపడి ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకి అడుగు పెట్టకుండా ఉండడంలోనే మన విజయం దాగి ఉంది. అర్హులైన వారందరూ వ్యాక్సిన్‌ తీసుకోవడంలోనే మన ఎంత విజయం ఆధారపడి ఉంది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడంలోనే మన విజయం ఆధారపడి ఉంది’’ అని మోదీ వివరించారు. వ్యాక్సిన్‌ వృథాని అరికట్టాలని ఆయన రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కరోనా కట్టడి చేయడం పెద్ద విషయమేమీ కాదన్నారు.

నాలుగు అంశాలే కీలకం

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రజలందరూ నాలుగు అంశాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని ప్రధాని మోదీ అన్నారు.

ప్రతి ఒక్కరూ మరొకరికి టీకా వేయించండి

వృద్ధులు, అంతగా చదువుకోని వారికి వ్యాక్సిన్‌ తీసుకోవడంలో ఇరుగు పొరుగు సహకరించాలి.

ప్రతి ఒక్కరూ మరొకరికి చికిత్స అందించండి

కోవిడ్‌ చికిత్సకి అవసరమయ్యే వనరులు, అవగా హన లేని వారికి అండగా నిలబడి చికిత్స చేయించాలి.

ప్రతి ఒక్కరూ మరొకరి ప్రాణాలు కాపాడండి

అందరూ మాస్కులు ధరిస్తే వారి ప్రాణాలను కాపాడుకోవడమే కాదు, పక్క వారి ప్రాణాలు కూడా కాపాడగలుగుతారు.

మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు

కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్న ప్రాంతాల్లో ప్రజలే భాగస్వాములై మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటుకు కృషి చేయాలి. కుటుంబాల్లో సభ్యులు, ఇతర సామాజిక కార్యకర్తలంతా కలిసి కరోనాపై నిత్యం యుద్ధం చేస్తూ ఉండాలి. జనాభా అత్యధికంగా ఉన్న భారత్‌లాంటి దేశాల్లో ప్రజా భాగస్వామ్యం లేనిదే కరోనాని అరికట్టలేమని మోదీ అభిప్రాయపడ్డారు.