India Cornavirus: దేశంలో ప్రమాదకరంగా మారిన కరోనా, ఒక్క రోజే 1,52,879 మందికి కరోనా, ఒక్క రోజే 839 మంది మృతి, ఇండియాలో 10 కోట్ల మార్క్‌ను దాటిన కొవిడ్ టీకా డోస్‌లు
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

New Delhi, April 11: దేశంలో ఒక్క రోజులో 1,45,384 మందికి కరోనా సోక‌గా, నిన్న కొత్త‌గా 1,52,879 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus Cases in India) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 90,584 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805 కు (COVID-19 Cases ) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 839 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,69,275కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,20,81,443 మంది కోలుకున్నారు. 11,08,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,15,95,147 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,66,26,850 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,12,047 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

కరోనాలో కొత్త రకాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్న జనాభా ఎక్కువగా ఉండడం, ఎన్నికలు, బహిరంగ కార్యక్రమాలు, అజాగ్రత్త, టీకాల కార్యక్రమం నెమ్మదిగా సాగడం వంటివి దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. టీకా తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించకపోవడం కూడా మరో కారణమని అంటున్నారు.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పంజా, ఒక్క రోజే 12 మంది మృతి, తాజాగా 3,309 మందికి కరోనా, కస్తూర్బా బాలికల విద్యాలయంలో 12 మందికి కోవిడ్ పాజిటివ్

కరోనా వైరస్ మొదటి ఉద్ధృతి తర్వాత ప్రజల్లో అలసత్వం పెరిగిందని ప్రముఖ వైరాలజిస్టులు షాహిద్ జమీల్, టి. జాకోబ్ జాన్‌లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వమే తొలుత అలసత్వం ప్రదర్శించిందని, ఆ తర్వాత రాజకీయ పార్టీలు, ప్రజల్లోనూ అది పెరిగిందని అన్నారు. సిబ్బంది మొత్తానికి టీకాలు ఇవ్వకుండానే పాఠశాలలు తెరిచారని అన్నారు. మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించి ఉంటే బాగుండేదన్నారు.

దీనికితోడు టీకాలు వేయడంలోనూ నిర్దిష్ట లక్యం ఏమీ లేకుండానే పోయిందన్నారు. కొన్ని చోట్ల అవసరం లేనప్పటికీ టీకాలు వేయడం వల్ల చాలా టీకాలు వృథా అయ్యాయన్నారు. మార్చి మొదటి నుంచే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఆరోగ్య కార్యకర్తలు, వృద్దులు టీకాలు తీసుకునేందుకు ముందుకు రాలేదన్నారు. దేశంలో ఇప్పటివరకు 5 శాతం మంది మాత్రమే తొలి విడత టీకా డోసు తీసుకున్నారని, 0.7 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ కారణంగానే వ్యాక్సినేషన్ ప్రభావం అంతగా కనిపించడం లేదని జమీల్, జాకోబ్ జాన్‌ వివరించారు.

ఏప్రిల్ నెలాఖరుకు మధ్య ప్రదేశ్‌లో లక్ష యాక్టివ్ కేసులు, మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పెరుగుదలను మధ్యలోనే నిలిపివేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపిన మధ్యప్రదేశ్ ‌సీఎం

ఇండియాలో కొవిడ్ టీకా డోస్ ల పంపిణీ 10 కోట్ల మార్క్ ను అధిగమించింది. ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, అత్యంత వేగంగా ఈ మైలురాయిని ఇండియా అధిగమించిందని పేర్కొంది. కేవలం 85 రోజుల్లోనే 10 కోట్ల డోస్ లను ప్రజలకు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 10 కోట్ల డోస్ లను ఇవ్వడానికి అమెరికాకు 89 రోజులు, చైనాకు 102 రోజుల సమయం పట్టిందని గుర్తు చేసింది. ఇదే సమయంలో ప్రధాని కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేస్తూ, "ఇండియాను కొవిడ్-19 రహితంగా చేసే క్రమంలో ఓ మైలురాయిని అధిగమించాం. కరోనాపై పోరాటంలో మరో అడుగు పడింది" అని పేర్కొంది.

ఇక రోజువారీ టీకా పంపిణీ విషయంలోనూ ఇండియా, మిగతా దేశాలతో పోలిస్తే ముందు నిలిచింది. సరాసరిన రోజుకు 38,93,288 టీకాలను ఇస్తున్నామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం రాత్రి 7.30 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకూ 10,12,84,282 మందికి టీకాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇండియాలో 45 సంవత్సరాల వయసు దాటిన అందరికీ టీకాను అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైంది. ఇక కరోనా కారణంగా సంభవించిన మరణాల విషయంలోనూ ఇండియా, ప్రపంచంతో పోలిస్తే, అతి తక్కువ మోర్టాలిటీ రేటు (1.28 శాతం)ను నమోదు చేసిందని కేంద్రం వెల్లడించింది.

కాగా, 85 రోజుల వ్యవధిలో యూఎస్ లో 9.20 కోట్ల మందికి, చైనాలో 6.14 కోట్ల మందికి, యూకేలో 2.13 కోట్ల మందికి టీకాను ఇచ్చారు. ఇండియాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, యూపీ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో దాదాపు 61 శాతం కేసులు ఈ రాష్టాల నుంచే వస్తున్నాయి. దేశంలో జనవరి 16 నుంచి టీకా పంపిణీ మొదలైన సంగతి తెలిసిందే.