Bhopal, April 10: మధ్యప్రదేశ్‌లో ఈ నెలాఖరుకల్లా కొవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) వెల్లడించారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం చూస్తుంటే... ఈ నెలాఖరు కల్లా మధ్య ప్రదేశ్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరే అవకాశం ఉంది. లాక్‌డౌన్ సహా వివిధ చర్యలు చేపట్టి ఎలాగైనా ఈ పెరుగుదలను మధ్యలోనే నిలిపివేసేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
శుక్రవారం రాత్రి సమయానికి రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 30,486కి చేరుకోగా.. మొత్తం కేసుల సంఖ్య 3,27,220కి పెరిగింది. కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొవిడ్ కేర్ సెంటర్లు తెరవాలని నిర్ణయించినట్టు సీఎం పేర్కొన్నారు.
కొవిడ్ కేర్ సెంటర్ల కోసం ఆరోగ్య శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్ రాజోరా ఇప్పటికే ఇండోర్, భోపాల్ నగరాల్లో భవనాల కోసం అన్వేషిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైద్యానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు.