కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థం. ఇది రక్తంలో ఉంటుంది, హార్మోన్లు, కణ గోడలు, విటమిన్ D తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతే, అది హృదయానికి, రక్తనాళాలకు హానికరం అవుతుంది. ఈ కొవ్వు రక్తనాళాల గోడలలో పేరుకుపోయి వాటిని ఇరుకుగా చేస్తుంది. దాంతో హృదయ సంబంధ వ్యాధులు,హై బీపీ, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కనిపించే ప్రధాన హెచ్చరిక సంకేతాలు
1. ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి భావం: ధమనులు కొవ్వుతో నిండిపోవడం వల్ల గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల ఛాతీలో నొప్పి, ఒత్తిడి లేదా భారంగా అనిపించడం వంటి లక్షణాలు కనపడవచ్చు. ముఖ్యంగా శ్రమ చేసే సమయంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది.
2. శ్వాసలో ఇబ్బంది: గుండె రక్తాన్ని పంప్ చేయడంలో కష్టపడుతుంది. ఫలితంగా శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వలన సాధారణ పనుల్లో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
3. అసాధారణ అలసట: అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్తప్రవాహం సరిగా జరగకపోవడం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, శక్తిలేమి అనిపించవచ్చు.
4. తిమ్మిరి లేదా జలదరింపు: రక్తప్రసరణ తగ్గడం వల్ల నరాలు ప్రభావితమై, చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా చలిగా అనిపించడం జరుగుతుంది.
5. రక్తపోటు పెరగడం: ధమనులు గట్టిపడటంతో గుండె మరింత ఒత్తిడితో రక్తాన్ని పంపించాలి, దీనివల్ల హై బీపీ వస్తుంది. ఇది హృదయంపై అదనపు భారాన్ని పెంచుతుంది.
బయటి రూపంలో కనిపించే సంకేతాలు:
కనురెప్పలపై పసుపు రంగు మచ్చలు (Xanthelasma): ఇవి కొవ్వు పేరుకుపోయిన సూచన.
చర్మంపై పసుపు కొవ్వు గడ్డలు (Xanthomas): ఇవి మోచేతులు, మోకాళ్లు, చేతులు, చీలమండలు లేదా పిరుదులపై కనపడవచ్చు.
కంటి ఐరిస్ చుట్టూ బూడిద-తెలుపు వలయం (Corneal Arcus): ఇది ముఖ్యంగా వృద్ధుల్లో అధిక కొలెస్ట్రాల్ సంకేతం.
అధిక కొలెస్ట్రాల్‌కు కారణాలు
1. అనారోగ్యకర ఆహారం: అధిక కొవ్వు, ప్రాసెస్డ్ ఫుడ్, మాంసాహారం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం.
2. శారీరక వ్యాయామం లేకపోవడం: కూర్చునే జీవనశైలి.
3. ధూమపానం, మద్యపానం: ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
4. జెనెటిక్ కారణాలు: కుటుంబ చరిత్రలో ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ.
5. అధిక బరువు మరియు డయాబెటీస్: ఇవి కూడా కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.
నిర్ధారణ, చికిత్స: అధిక కొలెస్ట్రాల్‌ను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ (Lipid Profile) అనే రక్తపరీక్ష చేయించాలి. ఇది రక్తంలోని HDL (మంచి కొలెస్ట్రాల్), LDL (చెడు కొలెస్ట్రాల్), ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను తెలుపుతుంది. ఫలితాలు అధికంగా ఉంటే, వైద్యుడు ఆహార నియంత్రణ, వ్యాయామం, మందులు వంటి చికిత్సలు సూచిస్తారు.
కొలెస్ట్రాల్ నియంత్రణకు చిట్కాలు:
ప్రతి రోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలి.
నూనెలు, ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తగ్గించాలి.
కూరగాయలు, పండ్లు, ఓట్స్, ఫైబర్ ఎక్కువగా తినాలి.
ధూమపానం, మద్యపానం మానేయాలి.
ప్రతీ ఆరు నెలలకు ఒకసారి లిపిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
అధిక కొలెస్ట్రాల్ మెల్లగా శరీరాన్ని ప్రభావితం చేసే నిశ్శబ్ద ప్రమాదం. పై సూచనలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఆరోగ్యకర జీవనశైలి పాటించడం ద్వారా దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చు.
isclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి