Sperm (photo-Pixabay)

ప్రపంచం వాతావరణ మార్పులు, కాలుష్యం, వేడిగాలులతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మరొక నిశ్శబ్ద ముప్పు మానవాళిని వెంటాడుతోంది. అదే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది. ఆహారపు అలవాట్లు, ఊబకాయం, ఒత్తిడి వంటి జీవనశైలి సమస్యలు మాత్రమే కాకుండా, వాయు కాలుష్యం, వేడి కూడా దీనికి ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ నీతి కౌతిష్ మాట్లాడుతూ.. పురుషుల్లో సంతానోత్పత్తి శక్తి కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య కాదు. అది పర్యావరణ సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ ఈ సమస్య భవిష్యత్ తరాలకు పెద్ద సవాలుగా మారుతోందని అన్నారు.

భారతదేశంలో వాయు కాలుష్యం ఎప్పటినుంచో ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఇది ఊపిరితిత్తులు, గుండె వ్యాధులకు మాత్రమే కాదు, పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు కూడా హానికరమని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. గాలిలో ఉన్న సూక్ష్మ ధూళి కణాలు (PM2.5), నైట్రోజన్ డయాక్సైడ్ వంటి విష వాయువులు రక్తంలోకి చేరి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతాయి. ఈ ప్రభావం వీర్యకణాల డీఎన్ఏను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను భంగం చేస్తుంది.

మధుమేహ రోగుల్లో కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించే మార్గం, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తల నూతన పరిశోధన, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో అధ్యయనం

‘ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్స్’ జర్నల్‌లో 2022లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. అధిక కాలుష్యానికి గురైన ప్రాంతాల్లో నివసించే పురుషుల్లో వీర్యకణాల చలనం గణనీయంగా తగ్గినట్లు తేలింది. చైనా, ఇటలీ దేశాల్లో కూడా ఇలాంటి ఫలితాలు నమోదయ్యాయి. కాలుష్య నగరాల్లోని పురుషుల్లో వీర్య నాణ్యత గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే 15 నుంచి 25 శాతం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దనే సరిగా పనిచేస్తాయి. అయితే గ్లోబల్ వార్మింగ్, వడగాలులు, వేడికాలంలో పనిచేయడం, బిగుతైన దుస్తులు ధరించడం వంటి అంశాలు వృషణాల ఉష్ణోగ్రతను పెంచి వీర్యకణాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. జర్నల్ ఆఫ్ థర్మల్ బయాలజీ’లోని అధ్యయనాలు చెబుతున్నట్లుగా, వృషణాల ఉష్ణోగ్రత కేవలం 1°C పెరిగినా వీర్యకణాల చలనం 40 శాతం వరకు తగ్గిపోతుంది. ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగం, ఫౌండ్రీల్లో పనిచేసే కార్మికులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) 2023లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కాలుష్యం, అధిక వేడికి గురైన పురుషుల్లో వీర్యకణాల డీఎన్ఏ దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా కనిపించింది.

డాక్టర్ కౌతిష్ సూచనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

అధిక ఉష్ణోగ్రతలకు దూరంగా ఉండడం, ముఖ్యంగా వడగాలుల సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

గాలి ఆడే వదుల దుస్తులు ధరించడం.

బయట పనిచేసే వారు తరచూ చల్లని ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవాలి.

ధూమపానం, మద్యం తగ్గించి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడం.

పురుషుల సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం వైద్య సమస్య మాత్రమే కాదు, పర్యావరణ సమస్య కూడా. వాయు నాణ్యత నియంత్రణ, పట్టణాల్లో వేడి తగ్గించే చర్యలు, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు అత్యవసరం. లేకపోతే, భవిష్యత్ తరాల సంతానోత్పత్తి సామర్థ్యమే ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.