మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కలిగే తీవ్రమైన సమస్యల్లో ఒకటి మూత్రపిండాల వైఫల్యం (Kidney Failure). ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి నివారించే మార్గం ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. తాజాగా ఐఐటీ బాంబే (IIT Bombay) పరిశోధక బృందం చేసిన పరిశోధనలో డయాబెటిస్ ఉన్న వ్యక్తుల రక్తంలో ఉన్న బయోమార్కర్లు ద్వారా భవిష్యత్తులో వారికి మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని తేలింది.
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ఇటీవల ప్రచురించబడ్డాయి. 2021 జూన్ నుండి 2022 జూలై వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో ఈ అధ్యయనం జరిగింది. ఇందులో మొత్తం 52 మంది వాలంటీర్ల రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు. వారిలో 23 మంది మధుమేహ రోగులు కాగా, 14 మంది ఇప్పటికే మధుమేహం వల్ల ఏర్పడిన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. మిగిలిన 15 మంది పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు.
పరిశోధకులు ఈ రక్త నమూనాలను విశ్లేషించినప్పుడు మధుమేహ రోగుల్లో 26 రకాల ప్రత్యేక జీవక్రియ ఉత్పత్తులు (Metabolites) ఉన్నట్లు గుర్తించారు. ఇవి సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తంలో కనిపించవు. ఈ మెటబాలైట్స్‌లోని మార్పులను గమనించడం ద్వారా భవిష్యత్తులో మూత్రపిండాల నష్టం ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎండోక్రినాలజీ నిపుణుడు డాక్టర్ రాకేశ్ కుమార్ సహాయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం హృద్రోగం ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కొలెస్ట్రాల్ పరీక్షలను ఉపయోగిస్తున్నాం. అదే విధంగా, భవిష్యత్తులో ఈ బయోమార్కర్ల పరీక్షలతో మధుమేహ రోగుల్లో కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు.
మధుమేహ రోగుల్లో 7 ప్రధాన మెటబాలైట్స్ స్థాయిలు క్రమంగా పెరుగుతుంటాయి. వీటిని గమనించడం ద్వారా వైద్యులు కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలోనే రోగిని గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చని తెలిపారు.ఈ పరిశోధన ఫలితాలు భారత వైద్య రంగానికి ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కిడ్నీ వ్యాధిని గుర్తించేందుకు రోగి కిడ్నీలు దెబ్బతిన్న తర్వాతే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండేది. కానీ ఈ బయోమార్కర్ పద్ధతి ద్వారా వ్యాధి ప్రారంభ దశలోనే జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది.
మధుమేహం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధి. దీని వల్ల కిడ్నీ వైఫల్యం, హృద్రోగం వంటి సంక్లిష్ట సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో IIT బాంబే పరిశోధన కొత్త మార్గదర్శకత్వాన్ని ఇస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. త్వరలో ఈ పరిశోధన ఆధారంగా ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధిని గుర్తించే పరీక్షలు అభివృద్ధి** చేయనున్నట్లు సమాచారం.