తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చలి తీవ్రత పెరుగుతోంది. సాధారణంగా డిసెంబర్ మొదటి వారంలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుండగా, ఈసారి నవంబర్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం ప్రజలను వణికిస్తోంది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గవచ్చని అధికారులు హెచ్చరించారు.
ఈ ఏడాది వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల భూమి తేమ ఎక్కువగా ఉంది. ఆ తేమతో కూడిన వాతావరణం ఇప్పుడు ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి వీచే చల్లని గాలులతో కలిసిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వైపు నుంచి చల్లని గాలులు తెలంగాణ వైపు దూసుకువస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున హనుమకొండలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4.2 డిగ్రీలు తక్కువ. పటాన్‌చెరులో 13.2 డిగ్రీలు, మెదక్‌లో 14.1 డిగ్రీలు, హైదరాబాద్‌లో 16.9 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 14.2 డిగ్రీలు, హయత్‌నగర్‌లో 15.6 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఎంతగా పెరిగిందో సూచిస్తున్నాయి.
కేవలం రాత్రి వేళల లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా నవంబర్ నెలలో పగటి ఉష్ణోగ్రతలు 32–33 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. అయితే ఆదివారం రామగుండంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలకే పరిమితమైంది. నిజామాబాద్‌లో 30.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 29.2 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. ఇదే చలి ప్రభావం పగటిపూట కూడా కొనసాగుతోందని సూచిస్తోంది.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం.. రాబోయే వారంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి — ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చని అంచనా. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 14 నుంచి 16 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వాతావరణ నిపుణులు ప్రజలను జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో బయటకు వెళ్ళేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించడం, చిన్న పిల్లలు, వృద్ధులు చలి ప్రభావం నుంచి రక్షించుకోవడం అవసరమని సూచించారు. పల్లెటూర్లలో పొగమంచు కారణంగా దృష్టి మందగించవచ్చని, రోడ్లపై వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని హెచ్చరించారు.
మొత్తం మీద చలి ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నవంబర్ 19 వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండడంతో తెలంగాణ ప్రజలు ముందుగానే చలి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.