Cold Wave (photo-ANI)

తెలంగాణలో వర్షాలకు తెరపడగా.. ఇప్పుడు చలి దాడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండగా.. రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.వాతావరణ శాఖ ప్రకారం, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుండి 14 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు ముఖ్యంగా రాత్రి వేళల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత మరింత అధికంగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేయడంతో, వాతావరణ కేంద్రం ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.ఇప్పటికే చలి ప్రభావం కనిపిస్తోంది. శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా బేలా ప్రాంతంలో 14.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రాత్రిపూట చలి ప్రభావం మరింత పెరుగుతుందని, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అధికారులు ప్రజలకు చలి నుండి రక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.