Ayodhya Deepotsav Celebrations: గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా అయోధ్య, 5.51లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం, కన్నులపండువగా రాముడి పట్టాభిషేకం
ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.
Lucknow, October 26: దీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని సీతా సమేతుడై అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయిన శుభ వేడుక సందర్భంగా అయోధ్య వాసులంతా దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం యోగీ ప్రభుత్వం చేపట్టింది. ఐదు రోజుల పాటు యూపీ వాసులంతా ఈ దీపావళి వేడుకలు జరుపుకుంటారు.
శ్రీరాముడు జన్మించిన అతి పవిత్రమైన అయోధ్యా నగరంలో 5.51లక్షల మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ‘దీపోత్సవం’ వరల్డ్ రికార్డుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈక్రమంలో శనివారం ఈ అక్టోబర్ 26,2019) రాత్రి యూపీ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది.
5.51లక్షల మట్టి ప్రమిదలలో దీపాలు
లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొననున్న అయోధ్య దీపోత్సవంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఊరేగింపు ప్రారంభమైంది.
కళాకారుల సందడి
సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొన్నారు. సీతారాములను ఆరాధించడంతో పాటు రాముడి పట్టాభిషేకం సాగనుంది. రామలీలా కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. 2,500 మంది విద్యార్థులు రాముడి జీవితంలోని ఘట్టాలతో చిత్రాలు గీశారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించనున్నారు.
రాముని పట్టాభిషేక కార్యక్రమంలో యూపీ సీఎం
ఈ అయోధ్య దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. 2018 లో యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం సరయు నదీ తీరంలో 3 లక్షల 150 మంటి మట్టి దీపాలను వెలిగించి దీపోత్సవ వేడుకలు చేసిన విషయం తెలిసిందే. ఈ రికార్డును తిరగరాసేందుకు ఈ ఏడాది 5.51లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం నిర్వహిస్తోంది.
కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సీఎం ఆదిత్యానాథ్
ఈ దీపోతవ్సం గురించి అయోధ్య బీజేపీ ఎమ్మెల్యే వేద ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ..అయోధ్య పర్యాటక రంగం పెంపొందించడానికి దీపావళి పండుగ సందర్భం మంచి అవకాశమని అన్నారు. అక్టోబర్ 26 శనివారం సాయంత్రం 5.50 లక్షలకు పైగా మట్టి దీపాలను వెలిగిస్తారని తెలిపారు. ఈ దీపోత్సవానికి ప్రభుత్వం రూ.130 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది.
కళాకారుల సందడి
ఈ ఉత్సవాన్ని తిలకించటానికి భక్తులు భారీగా తరలిరానున్నారని దీని కోసం తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వేడుకల్లో వేలాదిమంది కళాకారులు పాల్గొన్నారు. పలు విధాల కళలను ప్రదర్శించి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. రకాల వేషధారణలతో ఆట పాటలతో అలరిస్తున్నారు.