Hafiz Saeed Convicted: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధింపు, ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగంలో దోషిగా తేల్చిన పాకిస్థాన్ కోర్టు
26/11 ముంబై దాడుల్లో హఫీజ్ సయీద్ సూత్రధారిగా ఉన్నాడు....
Lahore, February 12: ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగాలల్లో జమాత్-ఉద్-దావా (JUD) చీఫ్ హఫీజ్ సయీద్‌ను (Hafiz Saeed) పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక కోర్టు (Pakistan ATC) బుధవారం దోషిగా తేల్చింది. హఫీజ్ సయీద్‌కు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఉగ్రవాదులకు నిధులకు సంబంధించి రెండు కేసుల్లో సయీద్ దోషిగా నిరూపించబడ్డాడని కోర్ట్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
ఒక్కో కేసుపై 5.5 ఏళ్ల జైలు శిక్ష మరియు 15 వేల నగదు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని కోర్టు ఉత్తర్వులలో పేర్కొనిందని ఆయన వివరించారు. రెండూ ఒకేరకమైన కేసులు కాబట్టి టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులను క్లబ్ చేయాలంటూ సయీద్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకు అంగీకరించిన పాకిస్థాన్ న్యాయస్థానం, రెండింటికీ కలిపి ఒకేరకమైన శిక్షను విధించింది.
పాకిస్థాన్ లోని లాహోర్ మరియు గుజ్రాన్‌వాలా నగరాల్లో సయీద్ పై ఈ రెండు కేసులు నమోదయ్యాయి. పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని పోలీసుల ఉగ్రవాద నిరోధక విభాగం ఈ కేసులను నమోదు చేసింది. వీటితో పాటు పంజాబ్ ప్రావిన్స్‌లోని వివిధ నగరాల్లో టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణల కింద సయీద్, మరియు అతడి అనుచరులపై సిటిడి పోలీసులు 23 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఈ క్రమంలో గతేడాది జూలై 17న సయీద్ ను అరెస్ట్ చేసి, లాహోర్‌లోని కోట్ లఖ్‌పాత్ జైలులో ఉంచారు.
సయీద్ పై నమోదైన మరో ఆరు కేసులపై కూడా ఏకకాలంలో విచారణ జరిపి, తీర్పు జారీచేయాలనే మరో పిటిషన్‌ను లాహోర్ కోర్టు మంగళవారం స్వీకరించింది. 26/11 ముంబై దాడుల్లో హఫీజ్ సయీద్ సూత్రధారిగా ఉన్నాడు.