Howdy Houston: మోడీ చేతిని ముద్దాడిన కాశ్మీరీ పండిట్, అగ్రరాజ్యంలో నరేంద్రుడికి ఘనస్వాగతం, తొలిసారిగా‘‘నమో’’ మెనూ వంటకాలు, హౌడీ-మోడీ పైనే అందరి కన్ను, యుఎస్ మీటింగ్ హైలెట్స్ ఇవే
అమెరికాలో అడుగు పెట్టగానే నరేంద్రుడికి అగ్ర రాజ్యంలో అక్కడి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు.
Houston, September 22: ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ ( PM Narendra Modi) అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టారు. అమెరికాలో అడుగు పెట్టగానే నరేంద్రుడికి అగ్ర రాజ్యంలో అక్కడి భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. 'హౌడీ మోడీ' ( Howdy Modi) కార్యక్రమంలో భాగంగా ముందుగా సిక్కులు, కశ్మీర్ పండిట్‌లు, వోహ్రా సమాజానికి చెందినవారు ప్రధాని మోడీని కలుసుకున్నారు. ప్రధానంగా సిక్కు వర్గం వారు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ( Article 370) రద్దుచేయడాన్ని గుర్తుచేస్తూ మోడీని అభినందించారు. దీంతో పాటుగా కతార్‌పూర్ కారిడార్ ఏర్పాటుకు గానూ మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 1984 సిక్కుల ఊచకోత, భారతీయ రాజ్యాంగంలోని సెక్షన్ 25, ఆనంద్ మ్యారేజ్ యాక్ట్, వీసా, పాస్‌పోర్ట్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ వారంతా మోడీకి ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. దీంతో పాటుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు పేరును మార్పుచేసి, గురునానక్‌దేవ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా నూతన నామకరణం చేయాలని సిక్కులు కోరారు.
పీఎం చేతిని ముద్దాడిన కశ్మీరీ పండిట్
పీఎం నరేంద్ర మోడీ అమెరికాలో ఉంటున్న కశ్మీరీ పండిట్ల సంఘాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా కశ్మీరీ పండిట్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కశ్మీరీ పండిట్లు ‘నమస్తే శారదా దేవి’ శ్లోకాన్ని పఠించి చివరగా మోదీ ‘అగైన్ నమోనమ:’ అని అనగానే అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. ఒక కశ్మీరీ పండిట్ ప్రధాని మోడీ చేతిని ముద్దాడుతూ ‘మోడీ గారు 7 లక్షల మంది కశ్మీరీ పండిట్ల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని అన్నారు. ఇక కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న కశ్మీరీ పండిట్ అరవింద్ చావ్లా మాట్లాడుతూ తాము ప్రధాని నరేంద్ర మోడీకి ఒక వినతి పత్రం సమర్పించామని తెలిపారు.
ఈ భేటీకి ముందు ప్రముఖ చమురు కంపెనీల సీఈవోలతో ప్రధాని మోడీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 16 సంస్థలకు చెందిన సీఈఓలు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. అమెరికా సంస్థ టెల్లూరియన్-భారత్‌కు చెందిన పెట్రోనెట్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 5 మిలియన్ టన్నుల సహజవాయువు కొనుగోలుకు ఎంవోయూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన లావాదేవీలు 2020 మార్చి 31నాటికి కొలిక్కి రానున్నాయి. చముర సంస్థల సీఈఓలతో సమావేశం ఫలవంతమైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రధాని మోడీ సైతం సీఈఓలతో భేటీపై ట్వీట్ చేస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. హ్యూస్టన్‌కు వచ్చి ఇంధన అంశాలపై మాట్లాడటం అసాధ్యమని అన్నారు. అయితే, ప్రముఖ చముర సంస్థల సీఈఓలతో సమావేశం అద్భుతంగా సాగింది.. ఇంధన రంగంలో అవకాశాలపై చర్చించామని అన్నారు.
సీఈఓలతో భేటీపై ట్వీట్ చేసిన ప్రధాని మోడీ
మోడీ యుఎస్ పర్యటన వివరాలు
ఈ నెల 27 వరకు అమెరికాలో పలు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సాగనుంది. ప్రధానంగా టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్, న్యూయార్క్‌లో ఆయన పర్యటనలు ఎక్కువగా కొనసాగనున్నాయి. హోస్టన్ లో ట్రంపుతో భేటీ పాటుగా కొందరు డెమొక్రటిక్ నేతలతో కలిసి మోడీ అక్కడ అక్కడి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆదివారం ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ పాల్గొని, ప్రసంగిస్తారు. ఆ సదస్సులో ఆరోగ్యం, టెర్రరిజంపైనా మోడీ మాట్లాడతారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును ఎండగట్టే అవకాశాలున్నాయి. తర్వాత మోడీ NRG స్టేడియంలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన చరిత్రాత్మక సదస్సులో పాల్గొంటారు. అమెరికా టైమ్ ప్రకారం 22న ఉదయం 10.45 గంటలకు ఇది జరగనుంది. ఆ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నారు. 50 వేల మంది ఎన్నారైలు పాల్గొనే సభకు అమెరికా అధ్యక్షుడు రాబోతుండటం ఇదే మొదటిసారి. అనేక మంది కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, అమెరికన్ ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా 400 మంది కళాకారుల ప్రదర్శనలతో 90 నిమిషాలపాటూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండనున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీకి వెల్ కం
ఎన్నారైల సదస్సు తర్వాత 24న ఐరాస సెక్రెటరీ జనరల్ ఇచ్చే విందుకు మోడీ హజరవుతారు. అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐరాసలో 150 మొక్కలు నాటే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. అదే సందర్భంలో పారిశ్రామిక వేత్తలు, భారత ప్రతినిధి బృందంతో మాట్లాడతారు. ఆ తర్వాత 27న తిరిగి భారత్ వస్తారు.
పర్యటనలో ప్రత్యేకలు
మోడీ యుఎస్ ట్రిప్ లో కొన్ని ఆసక్తిక విషయాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( modi meet donlad trump) తో ఈ ఏడాదిలోనే వరుసగా మూడోసారి భేటి కానున్నారు. ఇంతకుముందు జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో, ఆ తర్వాత ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో వాళ్లిద్దరూ కలిశారు. అలాగే 22న జరిగే హౌడీ-మోడీ ఎన్నారైల సదస్సులో ట్రంప్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఇదొక అవకాశంగా అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తడిసి ముద్దయిన హోస్టన్ నగరం
ఇదిలా ఉంటే ఎన్నారైలతో తలపెట్టిన ‘హౌడీ మోడీ’ ( Howdy Modi) కార్యక్రమానికి ఏర్పాట్లు ఓ పక్క శరవేగంగా పూర్తవుతుంటే మరో పక్క హోస్టన్ ( Howdy Houston) నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో వరద నీరు ఇంకా రోడ్లపైనే ఉంది. టెక్సాస్ రాష్ట గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 13 కౌంటీలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దక్షిణ టెక్సాస్‌లో ప్రజలను బయటికి రావొద్దని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం హౌడీ-మోడీ సభ జరిగే NRG స్టేడియం కూడా వాన నీటితో నిండిపోయింది. దాదాపు 1,500 మంది వాలంటీర్లు సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు.
భారీ వర్షాలతో హోరెత్తిన హోస్టన్ నగరం
నమో మెనూతో పసందైన వంటకాలు
వారం రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ కోసం ప్రత్యేక మెనూ సిద్ధమైంది. హోస్టన్ చెఫ్ కిరణ్ వర్మ ప్రధాని కోసం ప్రత్యేకంగా రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి పేరుతో పసందైన వంటకాలను వడ్డించనున్నారు. నమో తాలి మిఠాయిలో రస్‌మలై, గజర్ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌లు ఉండగా, నమో తాలి సేవ్రిలో కిచిడీ, కచోరీ, మేతి తెప్లా వంటకాలున్నాయి. పలు రాష్ట్రాలు, నగరాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను ప్రధాని కోసం సంసిద్ధం చేస్తామని చెఫ్ కిరణ్ పేర్కొన్నారు. ప్రధాని ఆరగించే పదార్ధాలను సిద్ధం చేయడం తనకు ఇదే తొలిసారని ఆమె తెలిపారు.
హౌ డూ యూ డూ మోడీ, టెక్సాస్ లోనే ఈ సభ ఎందుకు ?
టెక్సాస్ ప్రజలు, అక్కడి భారతీయ అమెరికన్లు ప్రధాని మోడీని హౌ డూ యూ డూ మోడీ ( Howdy Modi ) అని పలకరించనున్నారు. హౌ డూ యూ అనే మాటను టెక్సాస్ ప్రాంతంలో వాడుక భాషలో హౌడీ అంటారు. అయితే భారీ ఎత్తున చేపడుతున్న సభను టెక్సాస్‌లో నిర్వహిస్తుండటం వెనుక ఓ కారణం ఉందని చెబుతున్నారు. టెక్సాస్ రాష్ట్రం కూడా మన కశ్మీర్ లాంటిదేనని చెప్పవచ్చు. విస్తీర్ణం పరంగా, జనసాంద్రత పరంగా అమెరికాలో రెండో అతిపెద్ద రాష్ట్రం టెక్సాస్. 1821లో స్పెయిన్ వలస పాలన నుంచి మెక్సికో విముక్తి పొందింది. ఆ విముక్తిలో టెక్సాస్ కూడా మెక్సికోలో భాగమైంది. ఇవి రెండూ 1836 రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్ పేరిట స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 1845లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చేరడానికి ఈ దేశం అంగీకరించింది. ఇది అమెరికా, మెక్సికో మధ్య యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధం ద్వారా కాలిఫోర్నియా, న్యూ మెక్సికో సిటీలను అమెరికా తన అధీనంలోకి తెచ్చుకుంది.
కాశ్మీర్ సమస్యకు పుల్ స్టాప్ ఇక్కడేనా ?
ఇప్పుడు ఆర్టికల్-370 రద్దు చేశాక కశ్మీర్ కూడా భారత్ లో విలీనమైంది. దీంతో పాకిస్తాన్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావిస్తోంది. అయితే ప్రపంచ దేశాలు దాని గోడును పట్టించుకోవడం లేదు. గతంలో పాకిస్థాన్‌కు మద్దతునిచ్చిన అమెరికా కూడా ఇప్పుడు భారత్ పక్షాన నిలిచింది. ఈ పర్యటన ద్వారా మోడీ కాశ్మీర అంశానికి పూర్తిగా పుల్ స్టాప్ పెట్టనున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ రాష్ట్రంలోనే మోదీ అతిపెద్ద సభను నిర్వహిస్తున్నారు. ట్రంప్ అమెరికా రాజకీయ నాయకులు, భారత సంతతి ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్న ఈ సభ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.