Imran Wins Vote of Confidence: పాక్ రాజకీయ సంక్షోభానికి తెర, అవిశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్ ఖాన్, 178 మంది మద్దతుగా నిలవడంతో సునాయాస విజయం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శనివారం జరిగిన విశ్వాస తీర్మానంలో (Imran Wins Vote of Confidence) విజయం సాధించారు. ప్రతిపక్షాలు ఓటింగ్ ప్రక్రియని బహిష్కరించడంతో ఆయన అత్యంత సునాయాసంగా నెగ్గారు.
Islamabad, March 6: దాయాది దేశం పాకిస్తాన్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శనివారం జరిగిన విశ్వాస తీర్మానంలో (Imran Wins Vote of Confidence) విజయం సాధించారు. ప్రతిపక్షాలు ఓటింగ్ ప్రక్రియని బహిష్కరించడంతో ఆయన అత్యంత సునాయాసంగా నెగ్గారు. పాక్ ఆర్థిక మంత్రి, అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రికీ ఇన్సాఫ్ ( పీటీఐ) అభ్యర్థి అబ్దుల్ హఫీజ్ షేక్ ఈ వారంలో జరిగిన సెనేట్ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇమ్రాన్‌కు 178 ఓట్లు పోలయ్యాయి. అవసరమైన దాని కన్నా ఆరు ఓట్లు ఎక్కువగా పడ్డాయి.
ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఇమ్రాన్ నేషనల్ అసెంబ్లీలో (Pakistan National Assembly) బలం నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. అధ్యక్షుడు అరిఫ్ అల్వి ఆదేశాల మేరకు దిగువ సభ శనివారం సమావేశమైంది. మొత్తం 342 స్థానాలున్న సభలో 172 ఓట్లు అధికార పక్షానికి రావాల్సి ఉంది. కానీ ఆయనకు మరో ఆరు ఓట్లు అధికంగానే పోలయ్యాయి. పీటీఐకి చెందిన ఎంపీలు సుమారు 155 మంది మొత్తం ఆయనకే ఓటేశారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దుతుగానే ఎంక్యూఎం-పీ, బలోచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్-క్వయిద్, గ్రాండ్ డెమోక్రటిక్ అలియన్స్‌కు చెందిన ఎంపీలు ఓటు వేశారు.
ఇండిపెండెంట్ అభ్యర్థి అస్లమ్ బొతానికి కూడా ప్రధానికే ఓటేశారు. తనకు ఓటేసిన పార్టీ ఎంపీలు, మిత్రపక్ష ఎంపీలకు ఇమ్రాన్ థ్యాంక్స్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాలేదు. కాగా 11 పార్టీల కూటమి ప్రతిపక్ష పాకిస్తాన్ డెమొక్రాటిక్ మూమెంట్ (పీడీఎమ్) ఓటింగ్ సమయంలో సభ నుంచి వాకౌట్ చేయడంతో విశ్వాస పరీక్షలో నెగ్గడం ఇమ్రాన్ ప్రభుత్వానికి సులువైంది. ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక స్పీకర్ అసద్ ఖైజర్ ఫలితాలను ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీకి 176 స్థానాలు వస్తే, ఇప్పటి బలపరీక్షలో 178 మంది మద్దతుగా నిలిచారని ఆయన వెల్లడించారు.