India-Canada Tensions: కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది, భారత్‌పై ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ దేశాలు ఆందోళన, కెనడా స్పందన ఏంటంటే..
ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా-భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తతలు రాజేసేలా ఉన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau) ఆరోపించిన సంగతి విదితమే.
Toronto, Sep 20: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా-భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తతలు రాజేసేలా ఉన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన ఖలిస్తానీ (Khalistan) ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau) ఆరోపించిన సంగతి విదితమే. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను (Hardeep Singh Nijjar) చంపిన కేసులో భారతీయ ఏజెంట్లకు (Indian Agents) సంబంధం ఉందని తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు.
ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా, బదులుగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. నిజ్జర్ హత్యపై తన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ట్రూడో.. కొద్దిగంటల తర్వాత ఈ ఘటనపై మరోసారి స్పందించారు. భారత్‌ను రెచ్చగొట్టాలని, లేదా ఉద్రిక్తతలు పెంచాలని తాము చూడటం లేదన్నారు. సిక్కు నేత హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని, స్పష్టత కోసం పనిచేయాలని భారత్‌ను కోరుతున్నామన్నారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అమెరికా (USA)లోని కొంతమంది నిపుణులు.. ట్రూడో తీరును తీవ్రంగా ఖండించారు. కెనడా చర్య ‘సిగ్గుచేటు’ అని దుయ్యబట్టారు. అటు ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్ట్రేలియా.. భారత్‌పై కెనడా ఆరోపణలు ఆందోళనకరమని పేర్కొంది. భారత్-కెనడా (India-Canada) మధ్య చోటు చేసుకొన్న పరిణామాలపై వాషింగ్టన్‌లో హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ చర్చాకార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. ‘‘ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారు. ఖలిస్థానీ నేత హత్యలోకి భారత్‌ను లాగుతూ అతడు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఇది రాజకీయంగా ట్రూడోకు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తుందేమో గానీ.. నాయకత్వ లక్షణం మాత్రం కాదు. ఈ వ్యవహారంలో అమెరికా నేతలు ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నాం. ఎందుకంటే కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది’’ అని ట్రూడో తీరుపై మండిపడ్డారు.
నిజ్జర్ హత్యకు సంబంధించి ట్రూడో ప్రస్తావించిన అంశాలపై అమెరికా శ్వేతసౌధ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఏడ్రియెన్ వాట్సన్ స్పందించారు. ‘‘కెనడాతో మేం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. హత్యపై దర్యాప్తు కొనసాగడం, బాధ్యులకు శిక్ష పడటం చాలా ముఖ్యం’’ అని ఆమె తెలిపారు. ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో కెనడా ప్రభుత్వంతో తాము మాట్లాడుతున్నామని బ్రిటన్ ప్రధాని సునాక్ అధికార ప్రతినిధి లండన్‌లో చెప్పారు.
‘భారత్‌పై కెనడా ఆరోపణలు ఆందోళనకరం. అయితే, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మా భాగస్వామ్య పక్షాలతో కలిసి తాజా పరిణామాలను మేం సునిశితంగా పరిశీలిస్తున్నాం. మా ఆందోళనలను భారత్‌తో కూడా పంచుకున్నాం. దీనిపై ఇంతకంటే మేం మాట్లాడలేం’’ అని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ విలేకరులతో అన్నారు.
ఇక బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ తన్మన్‌జీత్ సింగ్ కూడా దీనిపై ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘కెనడా వ్యాఖ్యలు ఆందోళనకరం. దీనిపై యూకే ప్రభుత్వంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. న్యాయం జరగాలని పేర్కొన్నారు.
కెనడా పౌరుడైన హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను ‘ఉగ్రవాది’గా 2020 జులైలో భారత్ ప్రకటించింది. దేశంలోని అతడి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జప్తుచేసింది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (45).. భారత్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జూన్ 18న పశ్చిమ కెనడాలోని సర్రే నగరంలో ఒక గురుద్వారా వెలుపల ఇద్దరు దుండగులు అతడిని కాల్చి చంపారు. ఈ వ్యవహారంలో భారత ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో సోమవారం ఆరోపించారు.
ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత ప్రమేయం ఉందంటూ ఆ దేశం అసంబద్ధ, ప్రేరేపిత విమర్శలు చేస్తోంది. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా ట్రూడో ఇలాంటి ఆరోపణలు చేశారు. వాటిని నాడే పూర్తిగా ఖండించాం. చట్టబద్ధ పాలన పట్ల పూర్తి నిబద్ధతను ప్రదర్శించే ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
మా డిమాండ్లపై కెనడా ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పైగా ఆ దేశ రాజకీయ నేతలు వేర్పాటువాద శక్తులకు బహిరంగ మద్దతు ఇవ్వడం ఆందోళనకరం. కెనడా భూభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
అనంతరం.. భారత్‌లోని కెనడా హైకమిషనర్ కామెరూన్ మెక్‌కేను ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి మన అధికారులు పిలిపించారు. ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ఆయనకు తెలియజేశారు. బహిష్కరించిన దౌత్యాధికారి కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ అధికారి ఒలీవియర్ సిల్వెస్టర్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ఐదు రోజుల్లోగా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భారత్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలకు కొద్ది వారాల ముందే కెనడా.. భారత్‌ను నిందించాలని ప్రయత్నించి భంగపాటుకు గురైనట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని అమెరికా సహా ఫైవ్ఐస్ గ్రూపులోని మిత్రదేశాలను కెనడా కోరిందట. అయితే, అందుకు ఆ దేశాల నుంచి స్పందన కరవైనట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం తాజాగా వెల్లడించింది.
జీ20 సదస్సుకు కొద్ది వారాల ముందు ఫైవ్‌ఐస్ ఇంటెలిజెన్స్ అలయన్స్ సీనియర్ అధికారులతో కెనడా రహస్యంగా చర్చలు జరిపినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. ఈ అలయన్స్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. నిజ్జర్ హత్యను బహిరంగంగా ఖండించాలని కెనడా.. ఆ దేశాలను కోరినట్లు తెలిపింది. అయితే, కెనడా వినతిని ఆ దేశాలు తిరస్కరించాయి. ఈ హత్య విషయాన్ని బహిరంగంగా లేవనెత్తేందుకు నిరాకరించినట్లు ఆ కథనం పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన జీ20 సదస్సుకు హాజరైన కెనడా.. భారత్ సహా మిత్రదేశాల అధినేతలతో కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జీ20 సదస్సు ముగిసిన వారం రోజుల తర్వాత భారత్‌పై ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక, భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్‌ను.. తమ దేశ పౌరుడిగా ట్రూడో పేర్కొనడం గమనార్హం.
తీవ్రవాద గ్రూపులకు సహకరించే కనీసం 9 వేర్పాటువాద సంస్థలకు కెనడా కేంద్రంగా ఉంది. వీటిపై చర్యలు తీసుకోవాలని భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆ దేశం పెడచెవిన పెడుతోంది. తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని భారత్‌కు పంపాలని కోరినా కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను చంపినవారినీ వెనక్కిపంపాలని కోరినా వినిపించుకోలేదని మంగళవారం అధికారులు వెల్లడించారు.
‘ఖలిస్థానీ అనుకూల అంతర్జాతీయ సిక్కు సంస్థ (డబ్ల్యూఎస్‌వో), ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్), సిక్కుస్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే), బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) పాకిస్థాన్‌కు అనుకూలంగా కెనడా నుంచి పని చేస్తున్నాయి.వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదులను అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోకుండా తిరిగి భారత్‌పైనే ఆ దేశం ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడుతోంది.
9 వేర్పాటువాద సంస్థలకు, పాకిస్థాన్ ఐఎస్‌ఐతో కలిసి పనిచేస్తున్న 8 మంది తీవ్రవాదులకు కెనడా స్వర్గధామంగా ఉందని భారత అధికారులు చెప్పారు. 1990లలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన గుర్వంత్ సింగ్‌ను అప్పగించాలని కోరినా స్పందన లేదని వారు వివరించారు.
తాజాగా భారత్‌లో పర్యటిస్తున్న తమ పౌరులకు కెనడా పలు హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. భారత్‌లో ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ, భద్రతా సమస్యలు ఎప్పుడైనా ఉత్పన్నం కావచ్చు. పరిస్థితులు వెనువెంటనే మారవచ్చు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. స్థానిక అధికారుల సూచనలను మీడియాలో ఎప్పటికప్పుడు అనుసరించండి. అత్యవసరం అయితే తప్ప భారత్ ప్రయాణం చేపట్టవద్దు.
మీ భద్రతను ప్రమాదంలో పెట్టవద్దు. కుటుంబ, వ్యాపార సంబంధ, లేదా పర్యాటక నేపథ్యంలో ఇండియా వెళదామన్న నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఇండియాలోనే ఉంటే కచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరాన్ని ఆలోచించండి. ఒకవేళ అక్కడ కచ్చితంగా ఉండాల్సిన అవసరం లేకుంటే వెంటనే ఆ దేశాన్ని వదిలి రావాలి’’ అని పేర్కొంది. ఈ మేరకు కెనడా తన ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు వెల్లడించింది.
అనూహ్యమైన భద్రత పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు ప్రయాణం మానుకోవాలని తమ పౌరులకు కెనడా సూచించింది. ఉగ్రముప్పు, మిలిటెన్సీ, అశాంతి, కిడ్నాప్ ముప్పు నేపథ్యంలో పర్యటించవద్దని అడ్వైజరీలో పేర్కొంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)