India Slams Pak At UN: బిన్ లాడెన్‌కు ఆశ్రయం, ఉగ్రవాదులకు పెన్సన్, హబీబ్ బ్యాంక్ దివాళా ఇవన్నీ మీ గొప్పతనాలే, ఇండియాకు ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఉందని నిరూపించగలరా, పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై విరుచుకుపడిన భారత్
New York,Septemebr 28: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌పై విషం చిమ్మిన పాక్‌కు తగిన సమాధానం చెప్పింది. రాబోయేది అణుయుద్ధమంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ దౌత్యవేత్తలా కాకుండా యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.తమ వక్ర బుద్ధిని ఇమ్రాన్ స్వయంగా అంతర్జాతీయ వేదిక మీద తానే ప్రదర్శించారంటూ ఎద్దేవా చేసింది. ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా పాకిస్తాన్ మారింది కాదా, ఇది ప్రపంచానికి తెలియదా అంటూ భారత్ ప్రశ్నించింది. తమ దేశానికి ఉగ్రసంస్థలతో ఎలాంటి సంబంధం లేదని పాక్ నిరూపించగలదా అంటూ సవాల్ చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ కశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మొదటి కార్యదర్శి విదిషా మైత్రా స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ దౌత్యవేత్తలా కాకుండా.. యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరించండం సరైంది కాదన్నారు. అణుయుద్ధం వస్తుందని హెచ్చరించిన ఇమ్రాన్ వ్యాఖ్యలు ఆ దేశం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నదని, దాంట్లో ఎటువంటి రాజనీతి లేదని భారత్ ఆరోపించింది.
ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన భారత్
పాక్‌కు ధీటుగా సమాధానం ఇచ్చిన భారత్
మోడీ తన ప్రసంగం ద్వారా ఉగ్రవాదంపై పోరుకు పిలుపిస్తే ఇమ్రాన్ మాత్రం భారత్‌పై విషం చిమ్మారు. కాశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమే అంటూ విద్వేషపూరితంగా మాట్లాడారు. భారతదేశం ఒక బౌద్ధ క్షేతం, అంతేకాని యుద్ధ క్షేత్రం కాదు! కాశ్మీర్ పేరు ఎత్తకుండానే, సూటిగా చెప్పాల్సిన విషయం చెప్పిన నరేంద్ర మోదీ, ఐరాసలో భారత ప్రధాని స్పీచ్
దీంతో ఐక్యరాజ్యసమితిలో రైట్ టు రిప్లై ఆప్షన్‌ను వినియోగించుకున్న భారత్ పాక్‌కు ధీటుగా సమాధానం చెప్పింది. రక్తపాతం, అణ్వస్త్రాలు, ఆయుధాల వినియోగం ,చివరి వరకు పోరాడతాం వంటి పదాలను ఇమ్రాన్ వాడటంపై భారత ప్రతినిధి విధిషా మైత్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ది మధ్యయుగం నాటి ఆలోచన ధోరణిగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణుయుద్ధం అంటూ పదే పదే ప్రస్తావించడం ద్వారా ఇమ్రాన్ అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలు భయపడ్డాయన్నారు. జెంటిల్మెన్ గేమ్‌గా పిలువబడే క్రికెట్ ఆటను ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు తమ దేశంలోనే ఆయుధాలు అమ్మే దారా ఆదమ్ ఖేల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా ఉందని విదిశా నిలదీశారు. పాక్‌లో 1947లో 23 శాతం మైనార్టీలు ఉండేవారని, ఇప్పుడు అక్కడ మైనార్టీల సంఖ్య కేవలం 3 శాతం మాత్రమే ఉందన్నారు.ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు.
ఉగ్రవాదికి పెన్షన్ అందించే ఏకైక దేశం పాకిస్తాన్
తమ దేశంలో ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా లేదని ఇమ్రాన్ అంటున్నారని, ఈ వ్యాఖ్యలు వాస్తవమే అయితే ఐక్యరాజ్యసమితి పరిశీలకుడి చేత ఇమ్రాన్ ఈ విషయాలను చెప్పించగలరా అంటూ మైత్రా ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోని అల్ ఖైయిదా ఉగ్రవాదికి పెన్షన్ అందించే ఏకైక దేశం పాకిస్తాన్ అన్నారు. దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా లేదా అని మైత్రా ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయకపోతే.. న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంక్ను ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాకిస్తాన్ వివరించగలదా.. ఎఫ్‌ఏటీఎఫ్ ఎందుకు పాక్‌ను నోటీసులో పెట్టిందో ప్రపంచ దేశాలకు తెలపగలదా.. ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ బహిరంగ రక్షకుడని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిచగలరా.. యూఎన్ బ్యాన్ చేసిన 130 మంది ఉగ్రవాదులు పాక్‌లోనే ఉన్నారని, 25 ఉగ్ర సంస్థలు కూడా అక్కడే ఉన్నాయని, దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా అని విదిశా ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించి చెప్పడం కాదు అని, 1971లో స్వంత ప్రజలను ఊచకోత కోసిన తీరును ఇమ్రాన్ గుర్తు చేసుకోవాలని భారత్ పేర్కొన్నది. యూఎన్ విడుదల చేసిన జాబితాలోని అల్ ఖయిదా ఉగ్రవాదికి పాక్ పెన్షన్ ఇవ్వడం వాస్తవం కాదా.. దీన్ని ఇమ్రాన్ ఖండిచగలరా అంటూ విదిషా మైత్రా ప్రశ్నల వర్షం కురిపించారు.
భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని కవ్విస్తూ... రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధమే వస్తే.. దాని విపరిణామాలు సరిహద్దులు దాటి విస్తరిస్తాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజంపై బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)