New York, September 27: న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశం (UNGA) సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం ప్రసంగించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా జాతిపితను స్మరించుకుంటూ మోదీ తన ప్రసంగంను ప్రారంభించారు. గాంధేయ మార్గం నేటికి మార్గదర్శకం అని మోదీ అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో ముఖ్యంగా అభివృద్ధి, భద్రత, ఉగ్రవాద నిరోధం, వాతావరణ మార్పులు వంటి అంశాలను ప్రస్తావించారు.
భారతదేశంలో ఇటీవల ముగిసిన 2019 లోక్‌సభ ఎన్నికలు అత్యంత చారిత్రాత్మకమైనవిగా మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రస్తావించారు. గడిచిన ఐదేళ్లలో తమ ప్రభుత్వం భారతదేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించిందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఒక ఉద్యమమే చేస్తున్నామని పేర్కొన్నారు. 15 కోట్ల మందికి నీరు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పిఎం మోడీ అన్నారు.
ప్రతీ పేదవారికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో 37 కోట్ల మందికి కొత్తగా ఖాతాలు తెరిచినట్లు ప్రధాని తెలియజేశారు. 'ఆయుష్మాన్ భారత్' పేరుతో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భారతదేశం, ప్రపంచంలోని ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగం - వీడియో:
కాశ్మీర్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించని మోదీ
ప్రధాని మోదీ, తన ప్రసంగంలో ఎక్కడా కూడా 'జమ్మూ కాశ్మీర్ -ఆర్టికల్ 370 రద్దు' అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ రకంగా ఆ అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారం అని, దేనిపై ఏ ఇతర దేశాల జోక్యం అవసరం లేదని అంతర్జాతీయ వేదికపై మోదీ మరోసారి చాటి చెప్పినట్లయింది. తాము యుద్ధాన్ని కోరుకోము అన్నట్లుగా " భారత్ ఒక బౌద్ధ క్షేత్రం, యుద్ధ క్షేత్రం ఎంతమాత్రం కాదు" ( (India is the land of Buddha and not Yuddha) అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ఒకటి అని తెలిపిన మోడీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
ఇక మరోవైపు, ఇదే వేదికపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగించనున్నారు. ఈ వేదికపై తన జెండా- అజెండా ఒక్కటే, అదే జమ్మూకాశ్మీర్. ఈ యుఎన్‌జిఎ సమావేశంలో తన ప్రసంగంలో మునుపెన్నడూ లేని విధంగా కాశ్మీర్ అంశాన్ని బలంగా ప్రస్తావిస్తానని ఇమ్రాన్ ఇప్పటికే వెల్లడించారు.