Iran Vs USA: మొదలైన యుద్ధం! ప్రతీకార దాడిలో 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' హతం అయ్యారని పేర్కొన్న ఇరాన్ స్టేట్ మీడియా, మంచిది..దీనిపై రేపు స్పందిస్తానని బదులిచ్చిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్
పరిస్థితులు చూస్తుంటే యూఎస్- ఇరాన్ యుద్ధం మొదలైందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే యూఎస్ పై దాడులకు సంబంధించి ఇరాన్ 13 ప్రణాళికలు....
Washington, January 8: ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులైమానిని చంపినందుకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతీకార దాడులకు (Iran Revenge Attacks) దిగింది. బుధవారం వేకువఝామున ఇరాక్ లోని అమెరికా ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా ఇరాన్ డజనుకుపైగా క్షిపణుల ( Missile)ను ప్రయోగించింది. ఇరాన్ చేసిన ఈ క్షిపణి దాడుల్లో కనీసం 80 మంది యూఎస్ సైనికులు మరణించి ఉంటారని సమాచారం. చనిపోయిన వారిని "అమెరికా ఉగ్రవాదులు" గా ఇరాన్ అధికారిక మీడియా అభివర్ణించింది.
'ఇరాక్‌లోని అమెరికా లక్ష్యాలపై టెహ్రాన్ ప్రయోగించిన 15 క్షిపణుల దాడుల్లో కనీసం 80 మంది అమెరికన్ టెర్రరిస్టులు (American Terrorists) మరణించారు. అలాగే, అమెరికా హెలికాప్టర్లు, సైనిక పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షిపణులను ఏదీ అడ్డుకోలేదు, అన్ని క్షిపణులు లక్ష్యాలను చేరాయి'. అని ఇరాన్ స్టేట్ టెలివిజన్ పేర్కొంది. దీనిపై అమెరికా ఏదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే, మరో 100 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
అయితే తాము చేసిన ఈ దాడి పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడం కోసమో, యుద్ధాన్ని కోరుకుంటూ చేసింది కాదని, కేవల ఆత్మరక్షణలో భాగంగా ఈ దాడి చేయాల్సి వచ్చిందని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ (Mohammad Javad Zarif) పేర్కొన్నారు.
కాగా, మొత్తం 22 మిస్సైల్స్ తో దాడి జరిగిందని, అయితే ఈ దాడుల్లో ఇరాకీలకు ఎవరికి ఏ హాని జరగలేదని ఇరాక్ మిలటరీ వెల్లడించింది.
ఇరాన్ చేపట్టిన దాడిపై అమెరికా (USA) స్పందించింది. యూఎస్ ప్రెసిడెంట్ ఈ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సరైన సమయంలో బదులిస్తామని యూఎస్ రక్షణశాఖ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందిస్తూ.. 'అంతా బాగానే ఉంది! ఇరాక్‌లోని రెండు యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ నుండి క్షిపణులను ప్రయోగించారు. జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టాలు ఎంత అనేది అంచనా వేస్తున్నాం, ఇప్పటివరకు అంతా బాగానే ఉంది, మా వద్ద ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మరియు సమర్థవంతమైన మిలటరీ బలగం ఉంది, రేపు ఉదయం దీనిపై ఓ ప్రకటన చేస్తాను' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
See Donald Trump's Tweet:
నిన్న ఖాసీం సులైమాని (Qasem Soleimani) ఖననం పూర్తైన కొద్దిసేపటికే ఇరాన్ దాడులు చేయడం ప్రారంభించింది. పరిస్థితులు చూస్తుంటే యూఎస్- ఇరాన్ యుద్ధం మొదలైందనే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే యూఎస్ పై దాడులకు సంబంధించి ఇరాన్ 13 ప్రణాళికలు రచించినట్లు సమాచారం. మరోపక్క అమెరికా తన అమ్ములపొదిలోని అత్యంత అధునాతనమైన 52 ఎఫ్35-ఏ స్టెల్త్ జెట్ యుద్ధ విమానాలను బయటకు తీసింది.