Iraq Anti-Govt Protests: నిరసనకారుల మంటల్లో రగులుతోన్న ఇరాక్, 60 మంది మృతి, 2500 మందికి తీవ్ర గాయాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు, రాజకీయ సంక్షోభం సృష్టించవద్దంటున్న ప్రధాని
ఎన్ని విధాలుగా నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ యత్నించినా ప్రజలు ఏమాత్రం లెక్కలేయటంలేదు.
Baghdad,October 5: గత కొన్ని రోజులుగా ఇరాక్‌లో ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ యత్నించినా ప్రజలు ఏమాత్రం లెక్కలేయటంలేదు. తమ నిరసనలు ఆపటంలేదు. దీంతో ప్రధాని నిరసనకారులపై పలు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ధాటికి మృతుల సంఖ్య 60 కి చేరింది. ఇరాకీ ప్రజలు సర్కారుకు వ్యతిరేకంగా రాళ్లు రువ్విన ఘటనలు, సైనికుల కాల్పుల్లో 2,500 మంది గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సమస్య, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ఇరాక్ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇరాక్‌లో షియాల ప్రాబల్య ప్రాంతమైన అల్ దివానియాహ్ నగరంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇరాక్ దేశంలోని నసీరియాహ్, దివానియాహ్, బస్రా, బాగ్ధాద్ నగరాల్లో అల్లర్లు పెచ్చరిల్లాయి. ఇరాక్ దేశంలో ప్రజాందోళనల నేపథ్యంలో ఆదిల్ అబ్దెల్ ప్రభుత్వం రాజీనామా చేయాలని ఆ దేశానికి చెందిన నాయకుడు మొఖ్తదా అల్ సదర్ డిమాండు చేస్తున్నారు.ప్రభుత్వం స్పందించే వరకూ లెజిస్లేచర్లు, పార్లమెంటు సభ్యులు సమావేశాలు బహిష్కరించాలని ఆయన కోరారు.
60కి చేరిన మృతుల సంఖ్య
రాజధాని బాగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది.ఐదురోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని బాగ్జాద్ లో జరిగిన అల్లర్లలో సుమారు 34 మంది మృతి చెందారు. మరో 1500 మంది వరకు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుకు నిరసనగా దేశ చిహ్నమైన లిబరేషన్ స్క్వేర్ వద్దకు ప్రజలు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. కాగా ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు చెబుతున్నారు. నిరసన కారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని అదిల్ ప్రయత్నించారు. రాజకీయ సంక్షోభం సృష్టించవద్దనీ.. శాంతి భద్రతలు నెలకొల్పేందుకు సహకరించాలని ప్రధాని కోరారు. కానీ సాధ్యం కాలేదు.
ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ఆందోళనలు
రోజు రోజుకు నిరసనలు ఉదృతమవ్వటంతో అధికారలు బాగ్దాద్..దక్షిణ నగరం నస్రియాలో కర్ఫ్యూలను విధించారు. దేశంలోని పలు ప్రాంతాలలో ఇంటర్నెట్ సర్వీసులకు కూడా నిలిపివేశారు. శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తంచేసుకోవాలని ప్రధాని సూచించారు. వారిపై ఎటువంటి హింసాత్మక చర్యలు తీసుకోవద్దని పోలీసులకు, భద్రతాదళాలకు ప్రధాని ఆదేశించారు.