Joe Biden Sworn in as US President: 'అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటాం, శ్వేతజాతి దురహంకారాన్ని ఓడిస్తాం'! అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్, కీలక ఆదేశాలపై తొలి సంతకం
నా గెలుపుపై ఈ సంబురాలు చేసుకోవటం లేదు, ప్రజాసామ్యం గెలిచినందుకు చేసుకుంటున్నాం. ఐకమత్యంతోనే కరోనా మహమ్మారి, జాతివివక్ష వంటి సవాళ్లను అధిగమించగలం. ఐక్యతే ప్రగతికి మార్గం. అమెరికా ప్రజలు సవాళ్లకు ఎదురునిలిచి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు’ అని బైడెన్ పేర్కొన్నారు....
Washington DC, January 21: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్ నిబంధనలు మరియు జనవరి 6న జరిగిన క్యాపిటల్ హింసాత్మక ఘటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ, కొద్దిమంది ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ విపరీతమైన ప్రాంతీయతత్వాన్ని తగ్గించుకుంటూ, మనుషుల మధ్య విబేధాలు తొలగించుకుంటూ ఐక్యంగా కొనసాగాలని పిలుపునిచ్చారు.
జాతి, వర్ణం, స్థానిక-స్థానికేతర అంతరాలతో విభజితమైన అమెరికా సమాజాన్ని ఐక్యం చేసి, స్వస్థత చేకూరుస్తామని అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఐకమత్యంతోనే సవాళ్లను అధిగమించగలమని స్పష్టంచేశారు. తనకు ఓటు వేసినా, వేయకపోయినా అమెరికన్లందరికీ అధ్యక్షుడిగా ఉంటానని చెప్పారు.
"ప్రజాస్వామ్యం అత్యంత విలువైనది, అయితే ప్రజాస్వామ్యంపై దాడి జరిగినప్పటికీ ఈ సమయంలో, నా మిత్రులారా, ప్రజాస్వామ్యం విజయం సాధించింది ఉంది" అని బిడెన్ అన్నారు
ఇది ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. నా గెలుపుపై ఈ సంబరాలు చేసుకోవటం లేదు, ప్రజాసామ్యం గెలిచినందుకు చేసుకుంటున్నాం. ఐకమత్యంతోనే కరోనా మహమ్మారి, జాతివివక్ష వంటి సవాళ్లను అధిగమించగలం. ఐక్యతే ప్రగతికి మార్గం. అమెరికా ప్రజలు సవాళ్లకు ఎదురునిలిచి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు’ అని బైడెన్ పేర్కొన్నారు. ‘అమెరికాలో ప్రజాస్వామ్యం బలంగా ఉన్నది. ఎన్నో సవాళ్లు అధిగమించి ఎదిగింది. ఇటీవల క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి దురదృష్టకరం. మరోసారి ఇలాంటివి పునరావృతం కావు. ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైంది. ఇది అమెరికా ప్రజలందరి విజయం. మంచి ప్రపంచంకోసం మనమందరం పాటుపడుదాం. సాధించాల్సింది చాలా ఉంది. అమెరికాను అన్ని విధాలుగా మెరుగుపరచాలి. దేశాభివృద్ధికి ప్రతి ఒక్క అమెరికన్ చేయూతనివ్వాలి అని బైడెన్ పిలుపునిచ్చారు.
కరోనా కారణంగా ఆర్థికరంగం దెబ్బతింది, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి కష్టకాలంలో మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలి రాజకీయ ఉగ్రవాదం, శ్వేతజాతీయుల ఆధిపత్యం, దేశీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, మనం ఓడించాలి. శ్వేతజాతి దురహంకారాన్ని ఓడిస్తాం. ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణం అమెరికాకే గర్వకారణం. దేశంలో సానుకూల మార్పుకు ఇదే నిదర్శనం. గత పాలనలో ఇబ్బంది పడిన మిత్రదేశాలను ఆదుకుంటాం. మంచి ప్రపంచ నిర్మాణానికి మళ్లీ అమెరికా నాయకత్వం వహించేలా చేస్తాం. శాంతి, అభివృద్ధి, భద్రతకు నమ్మకమైన భాగస్వామిగా ఉంటాం. మన భాగస్వామ్య దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపరిచి. మరోసారి ప్రపంచంతో మమేకమవుతాం’ అని బైడెన్ పేర్కొన్నారు.
బైడెన్ కీలక ఆదేశాలు
ఇక అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే బైడెన్ ఏకంగా 17 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, మెమోరాండంలు మరియు ప్రకటనలపై సంతకం చేశాడు. మొదటగా దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించే మార్గదర్శకాలపై కొత్త ఆదేశాలిచ్చిన బైడెన్, గత పాలనలో ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ ఎత్తివేశారు. ఇందులో ప్రధానంగా ముస్లిం మరియు ఆఫ్రికన్ దేశాలపై ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయడం, పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరడం మరియు WHO నుంచి అమెరికా వైదొలగడంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఎత్తివేశారు. అలాగే వివిధ దేశాల పౌరులకు గ్రీన్ కార్డుల జారీ మరియు ఉద్యోగాల కల్పన తదితర విషయాల్లో ట్రంప్ ఆంక్షలను బైడెన్ ఉపసంహరించారు.