Twitter Paid Services: ట్విట్టర్‌లో అసలైన వ్యాపారం మొదలు పెట్టిన ఎలాన్ మస్క్, కేవలం బ్లూటిక్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయ్, మెసేజ్‌లు, వీడియోలకు కూడా డబ్బులు వసూలు చేసే యోచనలో మస్క్, రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు
బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు చాలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే ప్రకటనలు, కొత్త సర్వీస్‌ల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాల్నికూడా అన్వేషిస్తున్నాడు.
NewYork, NOV 05: ట్విట్టర్ (Twitter) కొనుగోలు వ్యవహారం మాత్రమే కాదు...కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ (Elon Musk ) నిర్ణయాలు కూడా సంచనలంగా మారుతున్నాయి. ఆయన ట్విట్టర్ ను చేజిక్కించుకున్నప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాడు. అంతేకాదు పెయిడ్ సర్వీసులపై కూడా సంచనల నిర్ణయాలు తీసుకుంటున్నారు. బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు చాలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే ప్రకటనలు, కొత్త సర్వీస్‌ల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాల్నికూడా అన్వేషిస్తున్నాడు. అందులో భాగంగానే యూజర్లకు పెయిడ్ సర్వీస్‌లు అందించబోతోంది ట్విట్టర్. అవేంటంటే..
పెయిడ్ వెరిఫికేషన్ (PAID VERIFICATION)
ట్విట్టర్‌లో ప్రస్తుతం 4 లక్షలకుపైగా వెరిఫైడ్ అకౌంట్‌లు ఉన్నాయి. పెయిడ్ సర్వీస్ ఫీచర్ వస్తే యూజర్లు తమ పేరు పక్కన బ్లూ టిక్ కనిపించడం కోసం నెలకు ఎనిమిది డాలర్లు చెల్లించాలి. అయితే, ఈ ఫీచర్ నవంబర్ 7వ తారీఖు నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ముందుగా అందుబాటులోకి రానుంది. ఈ సర్వీస్ తీసుకున్నవాళ్లు అథెంటికేషన్ కోసం ఐడెంటిటీ ప్రూఫ్ అవసరం లేదట.
పెయిడ్ మెసేజ్‌లు, వీడియోలు(PAID DIRECT MESSAGES)
పాపులర్ వ్యక్తులు, సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాలకు ఈ ఫీచర్ వర్తించనుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు కొన్ని డాలర్లు చెల్లించి తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు డైరెక్ట్‌గా మెసేజ్‌లని పంపొచ్చు. యూజర్లు కంటెంట్ క్రియేటర్స్ పోస్ట్ చేసిన వీడియోల్ని చూడాలంటే ఇకపై డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అందులోంచి ట్విట్టర్‌కి కూడా ఆదాయం రానుంది.
వేలల్లో ఉద్యోగాలు ఊడుతున్నాయి
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ట్విట్టర్‌ని కొనేందుకు బిడ్ వేశాడు ఎలాన్ మస్క్. చివరకు అక్టోబర్ 27వ తేదీన 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ని చేజిక్కించుకన్నాడు. ట్విట్టర్‌ని స్వేచ్ఛగా గొంతు వినిపించే వాళ్లకు అనువైన వేదికగా మారుస్తానని చెప్పాడు మస్క్. అంతేకాదు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్‌ని, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ వంటి ముఖ్యమైన వాళ్లను తొలగించాడు. ఇప్పటికే చాలామందిని తొలగిస్తున్నట్టు ఇమెయిల్స్ పంపించింది ట్విట్టర్.