Where Is Our Sidhu: 'మన సిద్ధూ ఎక్కడ'? అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్, నేడు గురునానక్ 550 జయంతి సందర్భంగా భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ప్రధాని మోదీ....
Islamabad, November 12: సిక్కుల పవిత్ర పుణ్యక్షేతం అయిన పాకిస్థాన్ లోని గురుద్వారా దర్బార్ సాహిబా (Gurdwara Darbar Sahib)ను భారత్ నుంచి వచ్చే భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఇటీవల నవంబర్ 9న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. గురు నానక్ (Shri Gurunanak Dev) తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని ఈ గురుద్వారా దర్బార్ సాహిబ్‌లోనే గడిపారని చెప్తారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ 5 వేల మంది సిక్కు భక్తులు ఈ గురుద్వార్‌ను దర్శించుకునేందుకు పాక్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. భారత్ - పాక్ విడివిడిగా ఈ కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించాయి. భారత చెక్ పోస్ట్ వద్ద ప్రధాని మోదీ, అటు వైపు పాకిస్థాన్ ఎంట్రీ వద్ద పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభోత్సవం చేశారు.
ఎప్పుడూ పాకిస్థాన్ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే కాంగ్రెస్ పార్టీ నేత, పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) కు ఈ కార్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా పాకిస్థాన్ నుంచి తొలి ఆహ్వానం లభించింది. అంతేకాదు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) స్వయంగా ఆ ఆహ్వానాన్ని నవజోత్ సింగ్ సిద్ధుకు పంపారు. అయితే అందుకు సిద్ధుకు భారత ప్రభుత్వం వెంటనే అనుమతి లభించలేదు. ప్రారంభోత్సవం సందర్భంగా పాకిస్థాన్ ఎంట్రీ వద్ద సిద్ధు కనిపించకపోవడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ "మన సిద్ధు ఎక్కడ? నేను అడిగేది మన సిద్ధు గురించి, ఏడి ఎక్కడా" అంటూ అధికారుల వద్ద వాకబు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇదే అందుకు సంబంధించిన వీడియో:
ఇమ్రాన్ ఖాన్ సిద్ధు గురించి అడిగినపుడు అధికారులు, సిద్ధు సార్ రావడానికి భారత అధికారులు ఆయనకు అనుమతి ఇవ్వడం లేదని బదులిచ్చారు. మరి మన్మోహన్ సింగ్ వచ్చారా? అని అడిగితే, మన్మోహన్ సింగ్ గారు వచ్చారు అని అధికారులు బదులు ఇచ్చారు.
ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ అధికారులతో మాట్లాడుతూ మన సిద్ధుని భారత ప్రభుత్వం హీరోని చేస్తుంది. అన్నీ ఛానెల్స్‌లో ఎప్పుడూ సిద్ధునే హెడ్‌లైన్స్ లో ఉంటారు అని చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ , నవజోత్ సింగ్ సిద్ధు గతంలో ఇద్దరూ క్రికెటర్లే, ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్‌గా వ్యవహరించగా, నవజోత్ సింగ్ సిద్ధు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరూ అప్పట్నించే మంచి స్నేహితులు. ఆ చనువుతోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ తన క్రికెట్ స్నేహితుడైన నవజోత్ సింగ్ సిద్ధుని సిద్ధు అంటూ ముద్దుగా పిలుస్తారు. అయితే మొత్తానికి ఆ ప్రారంభోత్సవానికి నవజోత్ సింగ్ వెళ్లారు. అప్పుడు చాలా మంది భారతీయులు, ఇక పాకిస్థాన్ లోనే ఉండు, ఇండియాకు రాకు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు.
ఇదిలా ఉండగా, సిక్కు మత స్థాపకుడు, సిక్కులు పవిత్రంగా కొలిచే వారి మొదటి గురువు 'శ్రీ గురునానక్ దేవ్' యొక్క 550వ జయంతి (Shri Guru Nanak Dev Birth Anniversery) నేడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. గురునానక్ కలలు కన్న అసమానతలు లేని, సామరస్యపూర్వకమైన సమాజం కోసం మనవంతు ప్రయత్నం చేస్తూ మనకు మనమే అంకితమిచ్చుకోవాల్సిన పవిత్రమైన రోజు ఇది అని మోదీ పేర్కొన్నారు.