Russian Government Resigns: రష్యా ప్రధానమంత్రి సహా, మంత్రివర్గం మొత్తం రాజీనామా, ప్రభుత్వ రద్దును ఆమోదించిన అధ్యక్షుడు పుతిన్, 'రాజకీయ' పరమైన రాజ్యాంగ సంస్కరణలే కారణమని వెల్లడించిన రష్యన్ మీడియా
అంతేకాకుండా మెడ్వెడెవ్ మరియు పుతిన్ ల మధ్య ఎన్నో ఏళ్లుగా మిత్రుత్వం ఉంది. రష్యన్ మీడియా కథనాల ప్రకారం.. 2024లో అధ్యక్షుడు పుతిన్ పదవీకాలం ముగియనుంది.....
Moscow, January 15: రష్యా ప్రధాన మంత్రి సహా మంత్రివర్గంలోని సభ్యులంతా (Russian Premier) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తన రాజీనామాతో పాటుగా మంత్రివర్గ రాజీనామాల తీర్మానాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సమర్పించినట్లు ప్రధాని డిమిత్రి మెడ్వెడెవ్ (Dmitry Medvedev) బుధవారం ప్రకటించారు. ఆ వెంటనే ప్రభుత్వం రద్దును అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆమోదించారు. ఇంతకాలంగా రష్యన్ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగా సేవలందించిన మెడ్వెడెవ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని పుతిన్ ఒక క్లుప్త ప్రకటన విడుదల చేశారు. అయితే, అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడంలో మాత్రం మంత్రులు విఫలమయ్యారని అధ్యక్షుడు పేర్కొన్నారు.
దేశ ప్రజలను ఉద్దేశించి రష్యా తాజా మాజీ ప్రధాని ప్రసంగిస్తూ, దేశం యొక్క భవిష్యత్తు, రష్యన్ ప్రజల ప్రయోజనాలను మెరుగుపరిచే దిశగా అధ్యక్షుడు పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉందని చెప్పారు. రష్యా ప్రధాన మంత్రి మరియు మంత్రుల 'పవర్' మరింత పెంచే దిశగా అధ్యక్షుడు రాజ్యాంగంలో మార్పులు చేయనున్నారు. దీంతో రష్యా ప్రభుత్వంలో అధికార సమతుల్యత కలుగుతుంది. ఈమేరకు తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకున్నట్లు మెడ్వెడెవ్ పేర్కొన్నారు.
2012 నుంచి నేటి వరకు డిమిత్రి మెడ్వెడెవ్ ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అంతేకాకుండా మెడ్వెడెవ్ మరియు పుతిన్ ల మధ్య ఎన్నో ఏళ్లుగా మిత్రుత్వం ఉంది. రష్యన్ మీడియా కథనాల ప్రకారం.. 2024లో అధ్యక్షుడు పుతిన్ పదవీకాలం ముగియనుంది.
రష్యన్ రాజ్యాంగం ప్రకారం దేశంపై సర్వహక్కులు రష్యా అధ్యక్షుడికే ఉంటాయి. ప్రధానమంత్రి పదవి కేవలం అలంకార ప్రాయం కొరకు మాత్రమే, ఈ నేపథ్యంలో పుతిన్ తన పదవీకాలం ముగిసిన తర్వాత దేశంపై అధికారాలు కోల్పోకుండా ఉండేందుకు తన అనుచరుడైన మెడ్వెడెవ్ ప్రధాన మంత్రి పదవిని మరింత శక్తివంతం చేయడానికి పుతిన్ ఇప్పట్నించే రాజ్యాంగ సవరణలు చేస్తున్నారు. అధ్యక్షుడి తర్వాత అధ్యక్షుడి అంతటి అధికారాలను ప్రధానమంత్రి పదవికి కట్టబెట్టనున్నారని అక్కడి మీడియా పేర్కొంది.