Sudan Conflict: సూడాన్‌లో ముదిరిన సంక్షోభం, అంతర్యుద్ధంలో 413 మంది మృతి, భారతీయులను తరలించేందుకు ఐఏఎఫ్‌ విమానాలను సిద్ధం చేసిన విదేశాంగ శాఖ

ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారా స్థాయికి చేరుతున్నది.ఈ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

Sudan Fighting (Photo Credits: Twitter)

Geneva, April 24: ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో సంక్షోభం (Sudan crisis) తీవ్ర రూపం దాల్చుతున్నది. ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారా స్థాయికి చేరుతున్నది.ఈ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌(RSF)కు నడుమ జరుగుతున్న భీకర అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరేట్‌ హ్యారిస్‌ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇదే సమావేశంలో యూనిసెఫ్‌ ప్రతినిధి జేమ్స్‌ ఎల్డర్‌ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు.

తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సూడాన్‌లో రోడ్ల మీద ఎటుచూసినా శవాలే, భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన, భారత ఎంబసీకి ఎవరూ వెళ్లద్దని ఆదేశాలు

సూడాన్‌ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్‌ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది.సూడాన్‌లో 2021 అక్టోబర్‌ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్‌ రాజధాని ఖార్తోమ్‌, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌కు నడుమ పోరాటం నడుస్తోంది.

సూడాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన యుద్ధ విమానాలు, నేవీకి చెందిన యుద్ధ నౌకను సిద్ధంగా ఉంచినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సుడాన్‌లో యుద్ధ తీవ్రత, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది.

సుడాన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సుడాన్‌ అధికారులతోపాటు ఐక్యరాజ్యసమితి, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్‌ ప్రభుత్వ వర్గాలతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు పేర్కొంది.

రెండు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-130జే విమానాలు ప్రస్తుతం జెడ్డాలో సిద్ధంగా ఉన్నాయి. నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమేధ కూడా సుడాన్‌ పోర్ట్‌కు చేరుకుంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సుడాన్‌లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నట్లు అధికార గణాంకాల ద్వారా తెలుస్తున్నది.

ఇక ఫైట్‌ ఇంకా కొనసాగడంతో రాజధాని ఖార్తోమ్‌లోని రాయబార కార్యాలయం నుంచి దౌత్య ప్రతినిధులు, సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది. అమెరికా సైన్యం సహకారంతో దౌత్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా సుడాన్‌ నుంచి బయటకు తరలించింది.సుమారు 70 మంది అమెరికన్ సిబ్బందిని ఎంబసీ నుంచి ఇథియోపియాలోని గుర్తు తెలియని ప్రదేశానికి విమానంలో తరలించినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన ఆదేశాల మేరకు ఖార్తోమ్‌ నుంచి అమెరికా దౌత్య సిబ్బందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు యూఎస్‌ మిలిటరీ ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుడాన్‌ రాజధాని ఖార్తోమ్‌లోని అమెరికా ఎంబసీని తాత్కాలికంగా మూసివేసినట్లు ఆయన వెల్లడించారు.

2021 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటు వల్ల సుడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం సుడాన్‌ ఆర్మీ చీఫ్ అబ్దేల్ ఫత్తా అల్ బుర్హాన్, ఆయన డిప్యూటీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)కు నేతృత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య విభేదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్‌ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర పోరాటం జరుగుతున్నది. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో సుడాన్‌లో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి.