Taliban-Afghanistan: మహిళలకు చోటిస్తే వ్యభిచారమే, వారు పిల్లల్ని కంటే చాలు, తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి సంచలన వ్యాఖ్యలు, తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రద్దు

వనరులు, నిధుల వృథా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్‌ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం (Afghanistan Govt Inaugural Ceremony) నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు.

Representative image

Kabul, Sep 12: ఆప్ఘనిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారాన్ని తాలిబన్లు (Taliban-Afghanistan) రద్దు చేశారు. వనరులు, నిధుల వృథా నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అమెరికాపై దాడులు జరిగిన 11 సెప్టెంబర్‌ నాడే అట్టహాసంగా తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం (Afghanistan Govt Inaugural Ceremony) నిర్వహించాలని తొలుత తాలిబన్లు భావించారు. ఇందుకోసం రష్యా, చైనా, ఖతార్, పాకిస్తాన్, ఇరాన్‌కు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అకస్మాత్తుగా ప్రమాణస్వీకారోత్సవ రద్దు నిర్ణయం ప్రకటించారు.

ప్రమాణ స్వీకారోత్సవం (Taliban government Formation) లేకపోయినా ప్రభుత్వం ఏర్పడి పనిచేయడం ప్రారంభమైందని తాలిబన్‌ ప్రతినిధి ఇనాముల్లా సమంగని ప్రకటించారు. అయితే నిధుల వృథా నివారణ అనేది అసలు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్‌ మిత్రుల ఒత్తిడి వల్లనే ఈ ఉత్సవాన్ని రద్దు చేశారని రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ తెలిపింది. 11న ప్రమాణ స్వీకారోత్సవం జరపడం అమానవీయమని, దాన్ని నిలిపివేయమని తాలిబన్లకు సలహా ఇవ్వాలని యూఎస్, నాటో దేశాలు ఖతార్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొంది.

పచ్చటి లోయ పంజ్‌షీర్‌పై పట్టు సాధించిన తాలిబన్లు, గవర్నర్‌ కార్యాలయంపై ఎగిరిన తాలిబన్ల జెండా, ఇంకా బయటకు రాని దాడుల నష్టం వివరాలు

దీనివల్ల అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించడం మరింత కఠినతరమవుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. గతంలో న్యూయార్క్‌ ట్విన్‌ టవర్స్‌ను కూల్చిన ఇదే రోజు (9/11) ప్రమాణస్వీకారం నిర్వహించాలని చూసినా.. మిత్రపక్ష దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. కాగా పాకిస్థాన్, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్, ఖతర్‌ తదితర దేశాలకు తాలిబన్లు ప్రమాణస్వీకార మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. రష్యా సహా మరికొన్ని మిత్రదేశాలు సెప్టెంబర్‌ 11న ( 9/11 terror attacks) జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకాలేమని పేర్కొన్నట్లు సమాచారం.

20 ఏళ్ళ తరువాత..ఆఫ్ఘ‌నిస్థాన్‌‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన అమెరికా బలగాలు, ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి ఇండియాకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిపిన తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి జ‌బిహుల్లా ముజాహిద్

ఇదిలా ఉంటే అఫ్గాన్‌ మహిళలు కేవలం పిల్లల్ని కంటే చాలని.. వారికి మంత్రి పదవులు అనవసరమని తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి అన్నారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్‌ సర్కారులో తమకు స్థానం కల్పించాలని కోరుతూ అక్కడి మహిళలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల 7న అఫ్గాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తాలిబన్లు మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వడం లేదన్న విషయమై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఈ నేపథ్యంలో స్థానిక టోలో న్యూస్‌ ఇంటర్వ్యూలో జెక్రుల్లా హాషిమి మాట్లాడుతూ.. ‘మహిళలు మంత్రులు కాలేరు. ఇలాంటి బాధ్యత వారికి అప్పగిస్తే.. తలపై మోయలేనంత బరువు మోపినట్లే అవుతుంది. వారు పిల్లలకు జన్మనిస్తే చాలు. మహిళా నిరసనకారులు దేశంలోని మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించలేరు’ అని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు సగభాగం కదా.. అనే ప్రశ్నకు తాము అలా భావించడం లేదన్నారు. ‘మహిళలకు చోటిచ్చి, గత 20 ఏళ్లుగా మా కార్యాలయాల్లో జరిగింది వ్యభిచారమేగా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అఫ్గాన్‌లో ఏర్పాటైన తాలిబన్‌ తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు యూనివర్సిటీలు, పీజీ స్థాయిలో చదువుకోవచ్చని ప్రకటించింది. అయితే, పురుషులతో కలిసి విద్యనభ్యసించడం మాత్రం కుదరదని స్పష్టం చేసింది. మహిళలు, పురుషులకు ప్రత్యేక తరగతి గదులు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్యావిధానాన్ని ఆదివారం విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు. చదువుకునే మహిళలు కచ్చితంగా ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ పాటించాలని తాలిబన్‌ ప్రభుత్వం తెలిపింది. హిజబ్‌’లు కచ్చితంగా ధరించాలని పేర్కొంది.

అయితే, తలతో పాటు ముఖం కూడా కనిపించకుండా స్కార్ఫ్‌లు ధరించాలా.. లేక తలకు మాత్రమే సరిపోతుందా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. అలాగే యూనివర్సిటీ బోధనాశాంల్లోనూ మార్పులు తీసుకొస్తామని అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు. ఎలాంటి మార్పులన్నది మాత్రం వెల్లడించలేదు. తాము కాలాన్ని 20 ఏళ్లకు తిరిగి తీసుకెళ్లాలనుకోవడం లేదని.. ఇప్పుడు ఉన్న పునాదులపైనే పునఃనిర్మాణాన్ని చేపడతామని హక్కానీ ప్రకటించడం గమనార్హం.

1990ల నాటి పాలనలో తాలిబన్లు మహిళలను చదువుకోవడానికి అనుమతించలేదు. వారిని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. దీంతో తాలిబన్లు మరోసారి అధికారంలోకి రాగానే నాటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతా ఆందోళన చెందారు. అయితే, తమ పాలన క్రితంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తాలిబన్లు తొలినుంచి చెబుతూ వస్తున్నారు. దీంతో తాలిబన్ల వైఖరిని ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.